ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విప్లవోద్యమాలకు గుమ్మడి నరసయ్య కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు.  ఇప్పటికీ ఆయన నిరాడంబర జీవితాన్ని గడుపుతుంటారు. ఐదుసార్లు ఇల్లెందు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నరసయ్య.. గత రెండు పర్యాయాలు ఎన్నికల్లో నిలబడినప్పటికీ ఓటమి పాలయ్యారు.  తర్వాత ఎన్నికలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.  


70 ఏళ్ల గుమ్మడి నర్సయ్య 1983 నుంచి ఐదు సార్లు ఇల్లెందులో గెలిచారు.  తాజాగా ప్రజా సమస్యలను విన్నవించేందుకు సీఎం రేవంత్ ను నాలుగు సార్లు కలిసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.  గుమ్మడి నరసయ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి హైదరాబాద్ వచ్చారు. ప్రజా సమస్యలను చెప్పడానికి.. రైతు భరోసా, వ్యవసాయ రుణాలు మాఫీ కాకపోవడంతో ఆ విషయాలను వెల్లడించడానికి ఆయన వచ్చారు.  ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద చాలాసేపు ఎదురు చూశారు.  అయినప్పటికీ ఆయనకు ముఖ్యమంత్రి దర్శన భాగ్యం కలగలేదు.



అయితే ఈ విషయం నిన్నటి నుంచి మీడియాలో ప్రముఖంగా ప్రసారమవుతోంది. సీఎంను కలిసేందుకు తెలిసిన నాయకులకు, అధికారులకు ఫోన్ చేస్తే రమ్మంటున్నారని.. కానీ అసలు పని మాత్రం కావడం లేదని ఆయన మీడియాతో వాపోయారు. సీతారామ ప్రాజెక్టు, చెక్ డ్యాంలు, పోడు భూములు, ఎత్తిపోతల పథకాలు తదితర సమస్యలు సీఎంకు వివరించాలని ప్రయత్నిస్తున్నా ఇంటి గేటు వద్దే నిలువరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  



నాడు గద్దర్ విషయంలో హంగామా చేసిన కాంగ్రెస్ నాయకులు.. ఈ విషయంలో మాత్రం కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు.. అయితే ఇదే అదునుగా గులాబీ మీడియా రెచ్చిపోతుంది.  రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై కావలసినంత బురద చల్లుతోంది. అయితే సీఎం రేవంత్ అయ్యాక అలాంటి పరిస్థితి లేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.  తాను అందరికీ సమయం ఇస్తున్నట్లు రేవంత్ స్వయంగా చెప్పారు. అలాంటిది ఇప్పుడు గుమ్మడి నర్సయ్య విషయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దీనిపై రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: