
అసలు ఫైబర్ నెట్‌లో ఏం జరుగుతోంది? అనే దానిపై కేంద్ర మంత్రి ఆరా తీసినట్టు సమాచారం. దీనిపై ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కూడా సమాచారం చేరడంతో ఈ వ్యవహారం కేంద్రం స్థాయిలో పెద్దదవుతున్నట్టు గుర్తించిన సీఎం చంద్రబాబు.. వెంటనే రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డితో వెంటనే ఏక సభ్యకమిటీని ఏర్పాటు చేసి.. వివాదానికి దారి తీసిన పరిస్థితులు.. పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆ వెంటనే ఆయన రంగంలోకి దిగిపోయారు.
ఈ క్రమంలో జీవీ రెడ్డి తన వాదనను బలంగా వినిపిస్తున్నారు. డైరెక్టర్‌ను తొలగించాలని ఆయన పట్టుబ డుతున్నారు. ఇదేసమయంలో ఫైబర్ నెట్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని.. దీనిని మూసివేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నట్టు సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు.. తాను చేసిన రాజద్రోహం ఆరోపణలకు కూడా జీవీ రెడ్డి కట్టుబడ్డట్లు తెలిసింది. ఇవన్నీ ఇలా ఉంటే.. అసలు చైర్మన్‌గా ఉండేందు కు కూడా ఆయన విముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.
మరోవైపు.. ఐఏఎస్ అధికారుల సంఘం కూడా జీవీ రెడ్డిపై ఆగ్రహంతో ఉంది. ఐఏఎస్‌లను రాజద్రోహులు గా చిత్రీకరించడం పట్ల సీనియర్ అధికారులు కన్రెర్ర చేస్తున్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబును కలుసుకునేందుకు వారు అప్పాయింట్‌మెంట్ కోరారు. సో.. మొత్తంగా జీవీ రెడ్డి చేసిన రచ్చ సర్కారు మెడకు తగులుతోంది. దీంతో ఏకంగా జీవీ రెడ్డిని తప్పించి.. పర్యాటక శాఖకు పంపించాలన్న చర్చ సాగుతోంది.చైర్మన్లు గా ఉన్నవారు.. వ్యవస్థలను గాడిలో పెట్టాలని.. ఇలా రచ్చ చేయడం సరికాదని సీఎం కూడా వ్యాఖ్యానించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.