ప్ర‌స్తుతం కూట‌మి స‌ర్కారుకు రైతుల నుంచి తీవ్ర స్థాయిలో సెగ త‌గులుతోంది. దీనిని ఎంత త‌క్కువ చేసి చూపించాల‌ని అనుకూల మీడియా ప్ర‌య‌త్నిస్తున్నా.. జిల్లాల స్థాయిలో రైతులు చేస్తున్న ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. రెండు ర‌కాల స‌మ‌స్య‌లు .. రైతుల‌ను పీల్చి పిప్పి చేస్తున్నాయి. 1) మిర్చి ధ‌ర‌లు ప‌త‌నానికి చేర‌డంతో ఆ రైతులు న‌ష్ట‌పోతున్నారు. రాష్ట్రంలోని 11 ఉమ్మ‌డి జిల్లాల్లో రైతులు మిర్చిని పండించారు.


కానీ, ఇప్పుడు వారు ధ‌ర‌లు రాక గుంటూరు మార్కెట్ యార్డులో ప‌డిగాపులు ప‌డుతున్నారు. వీరికి రాష్ట్ర స‌ర్కారు నుంచి సాంత్వ‌న ల‌భిస్తుంద‌ని భావించినా.. స‌ర్కారు కేంద్ర‌పైకి నెట్టేసింది. దీంతో కేంద్రం ఎప్పుడు నిర్ణ‌యం తీసుకుంటుందో చెప్ప‌లేని ప‌రిస్థితి నెలకొంది. పైకి.. కేంద్రం మొగ్గు చూపుతోంద‌ని.. మార్కెట్ ఇన్‌ట‌ర్వెన్ష‌న్ స్కీమ్‌ను పెంచుతూ.. నిర్ణ‌యం తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉంద‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి ఇది అంత తేలిక కాదు.


ఒక్క ఏపీని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ త‌ర‌హా నిర్ణ‌యం తీసుకుంటే.. బార్టీ, మొక్క‌జొన్న‌, స‌జ్జ‌లు, రాగులు పండిస్తున్న పంజాబ్‌, హ‌రియాణ‌, తెలంగాణ వంటి రాష్ట్రాలు కూడా ఇదే త‌ర‌హా డిమాండ్లు చేస్తాయి. అప్పుడు మార్కెట్‌ను మొత్తంగా కేంద్రం భ‌రించే ప‌రిస్థితి ఉండ‌దు. సో.. ప్ర‌స్తుతానికి దీనిపై క‌మిటీ వేస్తామ‌ని మాత్రమే కేంద్రం హామీ ఇచ్చింది. ఇదిలావుంటే.. టమాటా రైతులు కూడా.. ధ‌ర‌లు ప‌త‌నానికి చేరుకుని ల‌బోదిబోమంటున్నారు. కిలో రూ.2కు ప‌డిపోయిన ద‌రిమిలా రైతులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.


ఇక్క‌డే సోష‌ల్ మీడియా ఎంట్రీ ఇచ్చింది. గ‌తంలో స‌ర్కారు సినిమాల రూప‌క‌ల్ప‌న‌కు ఖ‌ర్చు పెరిగింద‌ని.. అప్పుడు టికెట్లు ధ‌ర‌లు పెంచుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింద‌ని.. అదేవిధంగా మ‌ద్యం ధ‌ర‌ల ను కూడా వ్యాపారుల‌కు అనుకూలంగా రెండు సార్లు స‌వ‌రించింద‌ని.. అలాంట‌ప్పుడు.. 54 ల‌క్ష‌ల మంది రైతులు ప‌డుతున్న ఆవేద‌న‌ను గుర్తించి.. ధ‌ర‌లు ఎందుకు పెంచ‌డం లేద‌న్న ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ.. వ‌స్తున్న ఈ కామెంట్లు స‌ర్కారుకు మ‌రింత సెగ పెంచుతున్నాయి. ఈ ప‌రిణామాల‌పై చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: