- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఇప్పుడు ఏపీలో రాజకీయంగా పుంజుకునేందుకు మరో అద్భుతమైన అవకాశం వచ్చింది. పార్టీని ముందుండి నడిపించడమే కాదు.. పార్టీ తరపున వాయిస్ వినిపించేందుకు, ప్రజలకు చేరువ అయ్యేందుకు షర్మిలకు ఇది చాలా మంచి అవకాశం. అయితే ఆమె దానిని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నారు అన్నదే అతిపెద్ద సందేహం. ఈ మాట ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి.. ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రఘువీరారెడ్డి స్వయంగా చెబుతున్నారు. ఆయన తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం రాజకీయంగా ఏర్పడిన శూన్య‌తను కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్చుకునే మంచి అవకాశం ఉందని రఘువీరా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు ఏర్పడి తొమ్మిది నెలలు అయింది.


ఈ క్రమంలో సహజంగానే ప్రజల్లో కొంత వ్యతిరేకత పెరుగుతుంది.. దీనిని తగ్గించుకునేందుకు కూటమి సర్కారు ప్రయత్నాలు చేస్తున్న.. రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధరలు కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం రైతులు అయితే దళారులు తమను మోసం చేస్తున్నారని వాపోతున్నారు. ఇక విద్యార్థుల బాధలు అన్నీ ఇన్ని కాదు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు. మరోవైపు డీఎస్సీ ఇప్పటికీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఉద్యోగాల భర్తీ లేదు. మరోవైపు వివిధ పథకాల రూపంలో తమకు గత ప్రభుత్వంలో డబ్బులు అందాయని.. ఇప్పుడు అవి లేకుండా పోయాయని మహిళలు, చేతివృత్తివాళ్లు ఆందోళనతో ఉన్నారు. దీనిని అందిపుచ్చుకొని పోరాటం చేయవలసిన వైసీపీ నిర్ల‌క్ష్యంగా ఉంది. పైగా వైసీపీ నాయకులు కూడా బయటకు వెళ్లిపోతున్నారు.


ఈ టైంలో షర్మిల యాక్టివ్ అయితే పార్టీకి ఊపు ఉంటుందన్నది ఆ పార్టీ నాయకులు చెబుతున్న మాట. అయితే షర్మిల మాత్రం హైదరాబాద్ గడప దాటి బయటికి రావటం లేదు. ఏదైనా ఉంటే సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం.. అంతటితో సర్దిపుచుకోవడం వరకే షర్మిల పరిమితం అవుతున్నారు. ఈ పరిణామాలే కాంగ్రెస్ నేతలకు అసలు నచ్చటం లేదు. షర్మిల ఈ టైంలో బయటకు వస్తే వైసిపి నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకు కొందరు నాయకులు సిద్ధంగా ఉన్నారని.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా అంది వచ్చిన మంచి అవకాశాన్ని షర్మిల చేజేతులా నాశనం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: