
వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానుందా? ఆ పార్టీ వ్యూహం మార్చిందా? అసెంబ్లీకి వెళ్లడమే మేలని మాజీ సీఎం జగన్ భావిస్తున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇప్పుడు ఇదే టాపిక్ వినిపిస్తోంది. ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నా యి. తొలిరోజు మండలి, శాసన సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తారు. ఈ సమావేశాలకు మాత్రమే జగన్ అండ్ కో హాజరవుతారని ప్రచారం నడుస్తోంది. తొలిరోజు వెళ్లినా.. మాటలు ఉండవు. ఇక, ఉండేదల్లా.. మౌనంగా కూర్చుని గవర్నర్ ప్రసంగాన్ని వినడమే.
ఇలా మౌనంగా కూర్చుని, గవర్నర్ ప్రసంగాన్ని వినేందుకే జగన్ ఆయన ఎమ్మెల్యేలు వస్తున్నారా? గతంలోనూ కూటమి హయాంలో జరిగిన మధ్యంతర బడ్జెట్ సమావేశాలకు జగన్ వచ్చారు. అప్పట్లో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ.. నల్లబ్యాడ్జీలు ధరించి.. నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున సుమారు రెండు కిలో మీటర్ల వరకు పాదయాత్ర చేశారు.
ఇప్పుడు కూడా అదే తరహా పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి. అదే సమయంలో సూపర్ సిక్స్ అమలు చేయడం లేదన్న వాదన కూడా విపక్షం వైసీపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల తొలిరోజు వచ్చి.. రచ్చ చేసి.. వెళ్లిపోవాలన్నదే ప్లానా? అనే సందేహాలు తెరమీదికి వచ్చాయి. గతంలోనూ.. గవర్నర్ ప్రసంగం కాయితాలను చింపేసి అక్కడే పడే మధ్యలోనే సభ నుంచి వాకౌట్ చేశారు.
సేమ్ టు సేమ్ ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు. ఇదిలావుంటే.. జగన్ సభలకు రాడు అన్న అపవాదును తొలగించుకోవడం.. తన సభ్యత్వాన్ని, తన పార్టీ నేతల సభ్యత్వాన్ని కూడా కాపాడుకునేందుకు ఒక్క రోజైనా అటెండ్ అయితే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నారన్నది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.