
దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ ఎవరంటే ముందుగా చెప్పాల్సిన పేరు శరద్ పవార్.. 38 ఏళ్లకే మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రానికి సీఎం అయిన ఘనత ఆయనది. సోనియా గాంధీ విదేశీయతను ప్రశ్నించి.. సొంత పార్టీ పెట్టుకుని.. ఆపై 25 ఏళ్లుగా అదే పార్టీతో పొత్తు పెట్టుకున్న చాణక్యం శరద్ పవార్ సొంతం.
అలాంటి శరద్ పవార్ ఇప్పుడు 83 ఏళ్ల వయసులో రాజకీయ జీవిత చరమాంకంలో ఉన్నారు. ఏడాదిన్నర కిందట ఆయన పార్టీ ఎన్సీపీ నిలువునా చీలిపోవడం.. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయంతో శరద్ పవార్ ఇక తప్పుకొంటారనే అనుకుంటున్నారు. కాగా.. ఎప్పుడు ఎలా నడుచుకోవాలో కూడా శరద్ పవార్ కు బాగా తెలుసని అంటారు. అలాంటి పెద్ద పవార్ తదుపరి ఏం చేయనున్నారనే ఆసక్తి నెలకొంది.
ఇక తాజాగా ఢిల్లీలో అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనంలో మరో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. విజ్ఞాన్ భవన్ లోని వేదికపై శరద్ పవార్ కుర్చీలో కూర్చోవడానికి కాస్త ఇబ్బంది పడగా ప్రధాని మోదీ ఆయనకు సాయం చేశారు. ఆ తర్వాత తన చేతితో స్వయంగా గ్లాసులో నీళ్లు నింపి శరద్ పవార్ కు అందించారు. ఈ సీన్ ను చూసిన అక్కడున్నవారంతా చర్చించుకోవడం మొదలుపెట్టారు. దీనికిముందు శరద్ పవార్ తన ప్రసంగంలో మోదీని ప్రశంసించడం గమనార్హం. మరాఠీకి ప్రాచీన భాష హోదా ఇవ్వడంలో ప్రధాని పాత్ర కీలకమని కొనియాడారు. ఇలా మాట్లాడిన అనంతరమే పవార్ కుర్చీలో కూర్చొనేందుకు మోదీ సాయపడడం గమనార్హం.
ఇంత వరకు బాగానే ఉన్నా తర్వాత శరత్ పవార్ మోదీకి షాక్ ఇచ్చేలా మాట్లాడారు. కేవలం ఒకే ఒక్క ఓటుతో 1999లో వాజ్ పేయీ ప్రభుత్వం కూలిపోవడానికి తన పాత్ర ఉందని పవార్ వెల్లడించారు. అవిశ్వాస తీర్మానం జరిగేందుకు ముందు 8-10 నిమిషాలు ముందు సభ వెలుపల జరిగిన మంతనాల కారణంగా అధికార ఎన్డీయే కూటమికి చెందిన ఒక ఓటు ప్రతిపక్షానికి అనుకూలంగా పడిందని దీని వెనుకు తన పాత్ర చాలా ఉందని పవార్ వెల్లడించారు.