
ప్రభుత్వం గ్రూపు -2 పరీక్ష వాయిదా వేయాలని కోరింది. కానీ, ఏపీపీఎస్సీ మాత్రం నో చెప్పింది. యథావిథిగా గ్రూపు -2 పరీక్షకే నిర్ణయించింది. ప్రభుత్వ జోక్యంతో ఖచ్చితంగా పరీక్ష వాయిదా పడుతుందని అభ్యర్ధులు ఆశించారు. అయినా, ఎన్నికల కోడ్ కారణంగా పరీక్ష వాయిదా వేయలే మని ఏపీపీఎస్సీ తేల్చి చెప్పింది.
గ్రూపు -2 మెయిన్ పరీక్షలు వాయిదా వేయాలని కొద్ది రోజులుగా అభ్యర్ధులు డిమాండ్ చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఒక ముఖ్య నేత ఉత్తరాంధ్రలో పరీక్ష వాయిదా పైన హామీ ఇచ్చారు. దీంతో పరీక్ష వాయిదా పడుతుందని అభ్యర్ధులు ఆశించారు. చివరి నిమిషం వరకు నిర్ణయం రాకపోవటం తో అభ్యర్ధులు రోడ్డెక్కారు. తీవ్రత గుర్తించిన ప్రభుత్వం శుక్రవారం రాత్రి సర్వీస్ కమిషన్‌కు లేఖ రాసింది. ఇదే సమయంలో అభ్యర్ధులు ప్రభుత్వం .. ఏపీపీఎస్సీ పైన ఒత్తిడి పెంచారు. రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు చేసారు. పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేసారు. చివరకు ఏపీపీఎస్సీ పరీక్ష వాయిదా లేదని తేల్చి చెప్పింది.
2023లో జారీ చేసిన గ్రూప్-2 నోటిఫికే షన్ రోస్టర్‌లో తప్పులున్నాయని, ఈ నోటిఫికేషన్ సరైన విధానంలో లేదని అభ్యర్థులు మొదటి నుంచీ వాదిస్తూ వస్తున్నారు. జీవో 77 ప్రకారం హారిజాంటల్ రోస్టర్ అమలు చేయాలని, కానీ పోస్టు లకు అందుకు విరుద్ధంగా పాత రోస్టర్ అమలు చేశారని ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి లేఖ కావాలని ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్ ఏఆర్ అనురాధ కోరారు. ఈ మేరకు ప్రభుత్వం ఏపీపీఎస్సీకి వాయిదా కోరుతూ లేఖ రాసింది.
ఇదే సమయంలో అభ్యర్థుల ఆవేదనను అర్థం చేసుకున్నాం. సమస్యను పరిష్కరిస్తామని మంత్రి లోకేశ్ ట్వీట్ చేయడంతో మెయిన్ వాయిదా కోరుతున్న అభ్యర్థుల్లో నమ్మకం పెరిగింది. అటు ఎమ్మెల్సీ ఎన్నికల పై సమీక్ష వేళ కూటమి నేతలు చంద్రబాబుకు మరో సారి సమస్య తీవ్రత ను వివరించారు. సాయంత్రానికి ఏపీపీఎస్సీ తమ నిర్ణయం వెల్లడించింది. ప్రస్తుతం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో... పరీక్ష వాయిదా 'కోడ్'ను ఉల్లంఘిం చినట్లు అవుతుందని సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. పరీక్ష యథాతథంగా జరుగుతుందని స్పష్టం చేసింది. అయితే, ప్రభుత్వం కోరిన తరువాత ఏపీపీఎస్సీ నిర్ణయం మార్చుకోకపోవటం పైన రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారం పైన ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.