ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీలో నాయ‌కులు స్త‌బ్దుగా ఉన్నారు. కొంద‌రు పార్టీలు మారుతున్నారు. మ‌రికొంద రు.. సైలెంట్‌గా ఉన్నారు. ఇంకొంద‌రు ఏదో నాయ‌కుడి మెప్పుకోసం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో వైసీపీలో అస‌లు ఏం జ‌రుగుతోంద‌న్న విష‌యంపై చ‌ర్చ సాగుతోంది. ఇదిలావుంటే.. బ‌య‌ట‌కు వ‌స్తున్న వారు.. త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని.. త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌ని అంటున్నారు. నిజానికి మంత్రులుగా ప‌నిచేసిన ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్ వంటి వారు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చారు.


అలాగే.. జ‌గ‌న్‌కు రైట్ హ్యాండ్‌గా భావించిన బాలినేని శ్రీనివాస‌రావు కూడా జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు. మ‌రి ఆయ‌న కూడా మంత్రిగానే ప‌నిచేశారు. అయితే.. వీరిలో కొంద‌రిని రెండున్న‌రేళ్ల‌కే మంత్రిగా ప‌క్క‌న పెట్ట‌డం బాధ‌క‌లిగించి ఉంటుంది. అయితే.. అస‌లు ద‌క్క‌నివారు కూడా ఉన్నారు. ఇక‌, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌.. ఏకంగా.. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని.. అందుకే బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని చెప్పేశారు. స‌రే.. న్యాయం జ‌ర‌గ‌ని వారు బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని స‌రిపుచ్చుకున్నా.. అస‌లు విష‌యం వేరేఉంది.


న్యాయం జ‌రిగిన వారు కూడా.. మంత్రులుగా చ‌క్రం తిప్పిన వారు స‌హా.. ఇత‌ర ప‌ద‌వులు ద‌క్కించుకున్న వారు కూడా.. వైసీపీకి దూర‌మ‌య్యారు. మ‌రి వీరిని ఎలా చూడాలి? అనేది ప్ర‌శ్న‌. కొంద‌రు బ‌య‌ట‌కు వ‌చ్చారు.. కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు. వారు పార్టీలోనే ఉన్న‌ప్ప‌టికీ.. వాయిస్ రెయిజ్ చేయ‌డం లేదు. వెల్లంప‌ల్లి శ్రీనివాసరావు, సీదిరి అప్ప‌ల‌రాజు, జోగి ర‌మేష్ స‌హా అనేక మంది ఫైర్‌బ్రాండ్లు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. పోనీ వీరు పార్టీ మారే ప‌రిస్థితి ఉందా? అంటే.. వీరిని ఎవ‌రూ చేర్చుకునే అవ‌కాశం లేదు.


అయినా.. కూడా పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించ‌డం లేదు. ఇక‌, ఎస్సీ, ఎస్టీల‌కు చెందిన నాయ‌కుల‌కు, మ‌హిళా నేత‌ల‌కు కూడా జ‌గ‌న్ ప‌ద‌వులు ఇచ్చారు. వారు కూడా ఇప్పుడు వాయిస్ వినిపించ‌డం లేదు. ఇటీవ‌ల ఏదో మొక్కుబ‌డిగా.. మాజీ ఉప ముఖ్య‌మంత్రి పుష్ప శ్రీవాణి స్పందించారు. మ‌రో  మంత్రి.. ఎస్సీ నాయ‌కురాలు.. తానేటి వ‌నిత ఎక్క‌డున్నారోకూడా క‌నిపించ‌డం లేదు. ఈమే కాదు.. అనేక మంది ల‌బ్ధి పొందిన వారు కూడా.. తెర‌మ‌రుగ‌య్యారు. మ‌రి న్యాయం జ‌రిగిన వారైనా పార్టీ త‌ర‌ఫున స్పందించాలి క‌దా! అంటే.. మౌనంగా ఉంటున్నారు. వీరిని రాబోయే రోజుల్లో ప‌క్క‌న పెడ‌తార‌న్న చ‌ర్చ అయితే.. వైసీపీలో వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp