
మంత్రులకు ఫోటోలపై ఉన్న శ్రద్ధ ప్రాణాలు కాపాడటంలో లేదని జగదీష్ రెడ్డి విమర్శించారు. టన్నెల్ లోని ఎనిమిది మంది ప్రాణాల గురించి అందరూ ఆతృత గా ఆరా తీస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం తోలు మందంతో వ్యవహరిస్తోందని జగదీష్ రెడ్డి ఆక్షేపించారు. బీఆర్ఎస్ ఈ ఘటనపై రాజకీయాలు చేయడం లేదన్న జగదీష్ రెడ్డి.. ఓట్ల కోసం బయలు దేరి సీఎం రాజకీయం చేస్తున్నారని అన్నారు.
గతంలో ఏ సీఎం కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళలేదని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రధాని మాట్లాడారు అన్నారు తప్ప మోదీని రక్షణ చర్యల గురించి అడిగినట్లు వెల్లడించలేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అసలు వాస్తవాలు వెల్లడించడం లో ప్రభుత్వం విఫలమైందన్న జగదీష్ రెడ్డి... టన్నెల్ తవ్వకం సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు.
సీపేజీ ఆగకపోవడం వల్లే గతంలో పనులు ముందుకు సాగలేదని, అసలు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఓ పెద్ద కుట్ర అని జగదీష్ రెడ్డి విమర్శించారు. నల్లగొండ ప్రజలకు కృష్ణా నీళ్లు రాకుండా చేయాలని గత సమైక్య పాలకులు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టును చేపట్టారని జగదీష్ రెడ్డి అన్నారు. ప్రమాదం జరిగితే ప్రచారానికి వెళ్తున్న సీఎంను పాలమూరు బిడ్డలు కాపాడుకోవాలా అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.
ప్రజల ప్రాణాలు సీఎంకు లెక్కలేదని జగదీష్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తన అమానవీయ ప్రవర్తన కు కార్మికులకు క్షమాపణ చెప్పాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో మాట్లాడి కార్మికుల ప్రాణాలు కాపాడాలని జగదీష్ రెడ్డి కోరారు.