
మియాపూర్లోని నరేన్ గార్డెన్స్ ప్రాంతం మొత్తం వాయు కాలుష్యంతో నిండిపోయింది. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపుగా మూడు నెలల నుంచి ఇద్దరు బిల్డర్లు చేసే పనులతో ఎయిర్ క్వాలిటీ ఏకంగా 342కి పెరిగింది. దీనిబట్టి ఇక్కడ కాలుష్యం ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు ఇక్కడ వాయు కాలుష్యం హెచ్చుమీరుతున్నా.. చూసీ చూడనట్లు వదిలేయడంతో ఇబ్బందులు తప్పడం లేదు. దీనికితోడు నిర్మాణాలు చేస్తున్న బిల్డర్లు.. కనీస నిబంధనలు పాటించడం లేదు. ఇక్కడ చుట్టూరా వాయు కాలుష్యం పెరుగకుండా తీసుకోవాల్సిన చర్యలను వదిలేశారు. ఇష్టం వచ్చినట్లుగా నిర్మాణం చేస్తున్న అపార్టుమెంట్లతో మియాపూర్ మొత్తం దుమ్ము ధూళితో కలుషితం అయిపోయింది. ఫలితంగా మియాపూర్ పరిధిలో వాయు కాలుష్యం పెరుగడంతో.. సుమారు పదుల సంఖ్యలో అపార్ట్మెంట్లలో శ్వాసకోస వ్యాధులు పెరిగిపోయాయి.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో గాలి నాణ్యత 0 నుంచి 50 లోపు నమోదు అయితే ఆ గాలి చాలా స్వచ్ఛంగా ఉందని అర్థం. అదే ఏక్యూఐ 51 నుంచి 100 వరకు ఉన్నట్లయితే గాలి నాణ్యత కొంత ప్రమాదకరంగానే మారుతుందని, ఇక 100 దాటితే అది ప్రమాదకరమని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ స్పష్టం చేస్తున్నది. కానీ, హైదరాబాద్ లో ని మియాపూర్ లో ఎయిర్ క్వాలిటీ 342 గా నమోదు అయ్యింది. మియాపూర్ నరేన్ గార్డెన్స్ వీధిలో ఇద్దరు బిల్డర్లు చేస్తున్న విధ్వంసంతో ఇక్కడ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
మియాపూర్ క్రాస్ సమీపంలో రెండు సంస్థలు భారీ నిర్మాణాలు చేపట్టాయి. నిత్యం రద్దీగా ఉంటే ప్రాంతమే కాకుండా.. ఇక్కడ వేల సంఖ్యలో ఫ్లాట్లతో అపార్ట్మెంట్లు ఉన్నాయి. కానీ, ఈ రెండు సంస్థల నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు ఇక్కడ జనం ఉండలేక పోతున్నారు. సంస్థలు ఇక్కడ నిర్మాణ సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవడంలేదు. అపార్ట్మెంట్ నిర్మాణాలు చేసే సమయంలో సమీప అపార్టుమెంట్ల మీద దుమ్మూ, ధూళి పడకుండా చర్యలు తీసుకోవాలని నిబంధనలు చెప్పుతున్నాయి. అంతేకాకుండా ఆ రూట్లో కాలుష్యం కలుషితం కాకుండా చుట్టూరా పరదాలు, సేఫ్టీ చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ, బిల్డర్ల కక్కుర్తి కారణంగా కనీసం రక్షణ చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ చుట్టూరా ఉండే అపార్ట్మెంట్లలోని జనం తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. పెద్దలు, చిన్నారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ దుమ్ము తీవ్రత ఎంతగా ఉందంటే.. పక్కన ఉన్న ఒక అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ లో వాయు కాలుష్యం 342గా నమోదైంది. అంటే.. ఇక్కడ కాలుష్యం ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
కొత్త నిర్మాణాలు చేసే సమయంలో అక్కడి పరిస్థితులను అంచనా వేసి అధికారులు నిర్మాణ అనుమతులు ఇస్తారు. అయితే, ఇలాంటి ప్రాంతాల్లో ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఇక్కడ పరీక్షలు చేసి నిర్మాణాలపై ఆంక్షలు విధించాలి. కానీ, ఈ రెండు నిర్మాణ సంస్థలు మేనేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాయి. నెలల తరబడి ఇదే తీరున ఇస్టానుసారంగా నిర్మాణాలు చేయడం, ఎలాంటి చర్యలు తీసుకోకుండా కన్స్ట్రక్షన్ చేస్తుండటంతో వాయు కాలుష్యం భారీగా పెరిగింది. దీంతో మియాపూర్ మొత్తం దుమ్ము ధూళితో కలుషితం అయిపోతుంది.