
ఢిల్లీ సీఎం సురేఖ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఖజానా మొత్తం ఖాళీ చేశారు. ప్రభుత్వం వద్ద పైసలు లేవు అని పేర్కొన్నారు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్థిక విధ్వంసం చేసిందని ఆరోపించారు. ఒక్క దిల్లీ సీఎం కాదు… గతంలో సీఎం రేవంత్రెడ్డి, చంద్రబాబులు కూడా అధికారం చేప్టగానే ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. వీరు చేసిన వ్యాఖ్యలన్నీ అంతకు ముందు ఉన్న పాలకుల గురించే.
'ధనిక రాష్ట్రం తెలంగాణ అనుకున్న.. ఖజానాలో బాగా డబ్బులు ఉన్నయని అనుకున్నం. లంకె బిందెలు ఉన్నయనుకుంటే.. ఇక్కడ ఏమీ లేవు' డిసెంబర్‌లో బాధ్యతలు చేపట్టిన తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలు. రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు. అప్పుల కుప్పగా మార్చారు. ఖజానాలో డబ్బులేమీ లేవు. అప్పులు మాత్రమే మిగిలాయి.. ఇవీ జూన్‌లో బాధ్యతలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంబ్రాబునాయుడు చేసిన వ్యాఖ్యలు.
అధికారంలోకి రావడానికి ఇష్టానుసారంగా ఉచిత హామీలు ఇస్తున్న రాజకీయ పార్టీలు వాటిని అమలు చేయాలంటే మాత్రం రాష్ట్ర ఆర్థిక బాగా లేదని.. సెట్ కావడానికి టైం పడుతుందని గత ప్రభుత్వంపై ఆ నెపాన్ని నెట్టేస్తూ చేతులు దులుపుకొంటున్నారు. అందిన కాడికి అప్పులు చేసేస్తున్నారు. ఉచిత పథకాలు అనుచితమని అన్ని పార్టీల నాయకులకు తెలిసినా..అధికారం కోసం తప్పడం లేదు.
అధికారం కోసం అలవికాని హామీలు ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఉచిత హామీలకు దూరంగా ఉన్న బీజేపీ ఇటీవల ఢిల్లీ ఎన్నికల సమయంలో ఉచితాలను గుమ్మరించింది. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే.. ప్రతి రాష్ట్రంలో గ్యారంటీల పేరుతో ఉచిత హామీల వర్షం కురిపిస్తోంది. ప్రాంతీయ పార్టీలు అదే బాటలో పయనిస్తున్నాయి. గెలిచాక కొన్ని అమలు చేస్తున్నాయి. మిగతా వాటికి డబ్బులు లేవని చేతులెత్తేస్తున్నాయి.
కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయంటారు పెద్దలు. అంటే ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా.. ఏ పనీ చేయకుంటా తింటూ ఉంటే కొంతకాలానికి కరిగిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వాలు ఇవే చేస్తున్నాయి. ఇదే క్రమంలో హామీలు అమలు చేయాలని కోరితే మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదని మాట దాటేస్తున్నాయి. మరి ఈ ఆర్థిక పరిస్థితి గురించి అధికారం రాగానే గుర్తుకు వస్తాయా అంటే వారికే తెలియాలి.