
తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పట్టభద్రుల ఎన్నికను.. అధికార కాంగ్రెస్ చాలా సీరియస్‌గా తీసుకుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్‌కు సంబంధించిన గ్రాడ్యుయేట్ సీటులో ప్రస్తుతం కాంగ్రెస్ సిట్టింగ్‌లో ఉంది. సీనియర్ నేత జీవన్‌రెడ్డి ఈ స్థానం నుంచి విజయం సాధించారు.
ప్రస్తుతం ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ సులభంగా విజయం సాధిస్తుందని భావించినా.. పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. దీంతో అధికార పార్టీ .. ఈ ఎన్నికను సీరియస్‌గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని తీరాలని పట్టుదలతో ఉంది. దీనికోసం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా బరిలోకి దిగుతున్నారంటే.. అర్థం చేసుకోవచ్చు.
మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా.. ఈ స్థానం కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. అధికారంలో ఉండి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోతే.. జనాల్లోకి వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో సీఎం రేవంత్ స్వయంగా బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. నరేందర్ రెడ్డి గెలుపును.. కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు ఎన్నికల బాధ్యతలను అప్పగించింది అధిష్టానం. వ్యూహ ప్రతివ్యూహాల విషయంలో పార్టీ కొత్త ఇంచార్జి మీనాక్షి నటరాజన్ చాలా సీరియస్‌గా ఉన్నారు.
సీఎం రేవంత్‌తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. బీసీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న వేళ.. కాంగ్రెస్ అలర్ట్ అయింది. దీంతో బీసీల కోసం ఏం చేశాం.. ఏం చేస్తున్నాం.. ఏం చేయబోతున్నామనే విషయాలను సీఎం స్వయంగా వివరిస్తున్నారు. కులగణన సర్వేతో పాటు.. బీసీ రిజర్వేషన్ చట్టబద్ధత విషయంలో చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తున్నారు. సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనికోసం పీసీసీ అధినేత సహా రాష్ట్ర మంత్రులంతా ప్రచారం ముమ్మరం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే.. నిరుద్యోగులు, ఉద్యోగుల ఆకాంక్షలను నెరవేరుస్తామంటూ హామీలిస్తున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఫైట్ మరింత ఇంట్రస్టింగ్ మారింది.