మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ ఇరుకున పడ్డారా.. ఏదో చేద్దాం అనుకొని అసెంబ్లీ వెళ్లి చిక్కుకున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.  ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే  ఇలా అసెంబ్లీ వెళ్లి వెంటనే వాకౌట్ చేసిన జగన్ పై కూటమి నేతలు అంతా మూకుమ్మడిగా అటాక్ చేయడం రాజకీయంగా హీట్ పెంచుతోంది.  ఏపీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి.   



ప్రతిపక్ష హోదా ఇవ్వనిదే సభలో అడుగుపెట్టనని భీష్మించుకున్న వైసీపీ అధినేత జగన్.. తన ప్రతిజ్ఞను కాసేపు పక్కన పెట్టారు.  గవర్నర్ ప్రసంగానికి హాజరై వెంటనే తన ఎమ్మెల్యేలతో వాకౌట్ చేశారు.  ఇలా జగన్ వాకౌట్ చేశారో లేదో కూటమి నేతలు రంగంలోకి దిగారు.  జగన్ ను టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేల్చారు.  ఈ ఐదేళ్లు జగన్ ప్రతిపక్ష హోదా అన్న పదం మరచిపోవాల్సిందేనని తేల్చేశారు పవన్.  


రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడాలంటే ప్రతిపక్ష హోదా ఉండాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.  గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ సీఎల్పీ నేత పి.జనార్దన్ రెడ్డి, పుచ్చపల్లి సుందరయ్య వంటివారు ఎందరో ప్రతిపక్ష హోదా లేకుండానే ప్రజల కోసం పనిచేశారంటూ చురకలు అంటించారు.


మంత్రి అచ్చెన్నాయుడు సైతం విపక్షంపై ఫైర్ అయ్యారు. 11 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష హోదా అడగడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు అచ్చెన్నాయుడు. హాజరు కోసమే వైసీపీ నేతలు సభకు వచ్చారని, వారికి ప్రజా సమస్యలపై ఆసక్తి లేదని విమర్శించారు.  సభ్యత్వాలు పోతాయనే భయంతోనే వైసీపీ నేతలు అసెంబ్లీకి వచ్చామని భావిస్తున్నట్లు చెప్పారు.


కూటమి నేతలతో పాటు షర్మిళ సైతం వీరికి జత కలిశారు.  అందరూ కలిసి నలువైపులా వైసీపీని టార్గెట్ చేయడం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది.  కూటమి ఏకధాటిగా మాటలు దాడి చేస్తున్నా వైసీపీ నుంచి వివరణ లేదా ఎదురుదాడి వంటివేవీ కనిపించలేదు. దీంతో జగన్ కూటమి పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: