
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికారంలోకి వచ్చి 9 నెలలు అయిందో లేదో ఆ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ తన పదవితో పాటు టిడిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు జీవీ రెడ్డి. సోమవారం తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపడంతో పాటు లేఖలో పలు కీలక అంశాలు ప్రస్తావించారు. తాను వ్యక్తిగత కారణాలతో పార్టీకి జాతీయ అధికార ప్రతినిధి పదవికి.. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. అయితే జీవీ రెడ్డి పదవితో పాటు పార్టీకి రాజీనామా చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచే సానుకూల అభిప్రాయం ఆయనపై వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా గ్రూపులో అన్నింటిలోనూ చంద్రబాబును ఏకేస్తున్నారు. జీవీ రెడ్డి లాంటి నాయకుడి విషయంలో చంద్రబాబు తీరు సరిగా లేదని.. చంద్రబాబుకు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలు గుర్తుకొస్తారని.. అధికారంలోకి వచ్చాక ఆయనకు అధికారులు మాత్రమే కనపడతారని ఫైర్ అవుతున్నారు.
తెలుగుదేశానికి 2019 లో 23 స్థానాలు వచ్చినప్పుడు ఓటమి చెందలేదు.. ఇదిగో.. ఇప్పుడు.. అసలు సిసలైన ఓటమి పాలు అయ్యిందని జీవి రెడ్డి లాంటి ఒక నిఖార్సైన నిజాయితీగల వ్యక్తి.. తనకు కేటాయించిన బాధ్యతల్లో అవినీతి పై ప్రశ్నించి ఆ అధికారి అవినీతిపై గళమెత్తి పోరాడితే ఇలాంటి బహుమానం ఇస్తారా ? అంటూ చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. చివరికి గళం ఎత్తినందుకు బదులుగా తానే చివాట్లు తిని.. అవమానానికి గురయ్యి.. ఆ సదరు అవినీతి అధికారి దర్జాగా కాలగర్ ఎగరేసుకునేలా చేయటం చూసి.. ఆత్మాభిమానంతో.. పార్టీ ఇచ్చిన పదవికి.. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారని రెడ్డికి సపోర్ట్‌గా పోస్టులు పెడుతున్నారు. చివరకు జీవి రెడ్డి రాజకీయం అంటేనే అసహ్యం కలిగేలా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని.. తాను న్యాయవాద వృత్తిలోనే ఉంటానని చెప్పారని.. అలా చేసిన తెలుగుదేశం పార్టీ ఎంతో గొప్పది అంటూ తెలుగుదేశం సైన్యమే సెటైర్లు వేస్తోంది.
చంద్రబాబు గారు ఇకపై కార్యకర్తలు.. పార్టీ నాయకులను కాదని.. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతోనే రాజకీయం చేసుకుంటారని... అలాగే చంద్రబాబు గారు.. దయ చేసి "యువత రాజకీయాల్లోకి రావాలి.. పులిహోర వడ్డించాలి.. " వంటి ఆవకాయ పిలుపులు ఇవ్వకండి.. అలా అయినా ఇతర యువకులు వాళ్ళ బతుకేదో వాళ్లు చూసుకుంటారని తెలుగుదేశం సోషల్ మీడియా ఆర్మీ తీవ్రస్థాయిలో తమ అసహనం వ్యక్తం చేస్తోంది. ఏదేమైనా ఈ విషయంలో జీవి రెడ్డికి టీడీపీ వాళ్లు ఫుల్లుగా సపోర్ట్ చేస్తున్నారు.