
అయితే.. అసలు జీవీ రెడ్డి వ్యక్తిగత వ్యవహారాన్ని పరిశీలిస్తే.. ఆయన దూకుడు కారణంగా రెండు మూడు సందర్భాల్లో టీడీపీ ఇరుకున పడిందన్నది వాస్తవం. అయితే.. ఆ రెండు మూడు సందర్భాల్లోనూ.. చంద్ర బాబు, నారా లోకేష్ జోక్యం చేసుకుని.. జీవీ రెడ్డిని నిలువరించారే. దీంతో అప్పట్లో పెను వివాదం నుంచి జీవీ రెడ్డి బయట పడ్డారు. వీటిలో ప్రధానంగా ఈనాడుకు చెందిన మార్గదర్శి వివాదం. ఈ విషయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పోరాడుతున్న విషయం తెలిసిందే.
దీనిలో ఎంట్రీ ఇచ్చిన జీవీ రెడ్డి.. నేరుగా ఉండవల్లితోనే చర్చకు సిద్ధమయ్యారు. చూసుకుందాం రా! అం టూ ఉండవల్లికి సవాల్ రువ్వారు. ఇది ఆయనకు ఎలా ఉన్నా.. టీడీపీకి ఇబ్బంది కలిగించింది. మార్గదర్శి కి.. టీడీపీకి అవినాభావ సంబంధం ఉందన్న కారణంగానే.. ఇలా చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు అప్పట్లో గట్టిగా చెప్పడంతో ఈ చర్చ లేకుండా అందరూ సైలెంట్ అయ్యారు. తర్వాత మరో సందర్భంలోనూ జీవీ రెడ్డి దూకుడు ప్రదర్శించారు.
వివేకానందరెడ్డి దారుణ కేసులో టీడీపీ బలమైన పోరాటం చేస్తున్న సమయంలో ఓ టీవీ చానెల్ చర్చలో జగన్ అమాయకుడు అంటూ.. వ్యాఖ్యానించారు. ఇది వైసీపీకి అందివచ్చింది. దీని నుంచి బయట పడేం దుకు టీడీపీ తిప్పలు పడాల్సి వచ్చింది. ఆయన ఉద్దేశం ఏదైనా.. జీవీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇక, తాజాగా ఐఏఎస్ అధికారిపై రాజద్రోహం కేసు పెట్టాలని చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. సో.. జీవీరెడ్డి దూకుడు.. రెండురకాలుగా టీడీపీకి పరాభవాన్నే తెచ్చాయి. అయితే.. ఆయన కమిట్‌మెంటును ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కానీ, దూకుడే కొంప ముంచింది.