
శ్రీశైలం ఎడమ కాలువ నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాద సంఘటనలు చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా తీసుకురావడానికి దేశంలో అందుబాటులో ఉన్న అత్యున్నత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, జూపల్లి కృష్ణా రావు స్పష్టం చేశారు. ప్రమాద సంఘటన జరిగిన విధానాన్నిరాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తోసహా సంబంధిత శాఖల అధికారులు, నిర్మాణ సంస్థ, ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వివిధ ఏజెన్సీల ప్రతినిధులు వివరించారు. ఎస్.ఎల్బీ.సి సంఘటన స్థలంలో 40 నుండి 50 మీటర్ల మేర బురద నిండుకుందని తెలిపారు. ఈ దుర్ఘటనలో 42 మంది సురక్షితంగా బయటికి రాగా, 8 మంది లోపల చిక్కుకున్నారని వివరించారు.
బురద నీటిని వెలికి తీయడానికి అన్ని ప్రయత్నాలను చేస్తున్నామని వివరించారు. ఎడమకాలువ టన్నెల్ లో 11 కిలోమీటర్ల తర్వాత నీటితో కలిగివుందని, అయినప్పటికీ 11 .5 కిలోమీటర్ల దూరం వరకు వివిధ ఏజెన్సీల రక్షణ బృందాలు వెళ్లగలిగాయని వివరించారు. 13 .50 కిలోమీటర్ల వద్ద టన్నెల్ బోరింగ్ మిషన్ (టీ.బీ.ఎం ) ఉందని, అక్కడికి వెళ్లే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామని అన్నారు. ఇక్కడినుండి ఎయిర్ సప్లై పైప్ లైన్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైనదని అన్నారు. సొరంగంలో ఎంత దూరం వరకు బురద, నీరు ఉందనేది జీ.ఎస్.ఐ., ఎం.జీ.ఆర్.ఐ లు అధ్యయనం చేస్తున్నాయని వెల్లడించారు.