
ఇక తాజాగా ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్‌గా ఉన్న జీవి రెడ్డి కొద్ది రోజుల క్రితం ప్రెస్‌మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలు పార్టీ కేడర్‌లో, సోషల్ మీడియా అభిమానుల్లో ప్రభుత్వానికి.. ముఖ్యమంత్రికి అధికారుల మీద గ్రిప్ లేదన్న సంకేతాలు పంపాయి. జీవి రెడ్డి కూడా ఆ పదవిలో ఉండి రాజకీయ నేతగానే వ్యవహరించారు. ఆయన పార్టీ కోసమో లేదా ఫైబర్ నెట్ కోసమో చేయాలనుకున్నా చేసిన తీరు వివాస్పదం అయ్యింది. దీంతో అందరి వేళ్లు చంద్రబాబు వైపు వెళ్లాయి. తర్వాత జీవి రెడ్డి చంద్రబాబుతో సమావేశం అయ్యారు.. ఏం జరిగిందో కాని ఆయన తన పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేశారు.
దీంతో టీడీపీ సోషల్ మీడియా వింగ్ మొత్తం జీవీ రెడ్డికి ఈ విషయంలో వన్‌సైడ్ సపోర్ట్ చేసింది. వేల మంది పార్టీ కార్యకర్తలు జీవి రెడ్డి రాజీనామాను ప్రశ్నిస్తూ... చంద్రబాబుకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. చంద్రబాబుకు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలు కావాలి.. అధికారంలోకి వచ్చాక ఆయనకు అధికారులు ముద్దు... కార్యకర్తలు వద్దు అన్నట్టుగా ఉంటారని విమర్శలు చేశారు. ఇక చంద్రబాబును సమర్థించే వారు మాత్రం జీవి రెడ్డి ఆవేశపడ్డారు అని... ఆయన ఏదైనా ఉంటే నేరుగా చంద్రబాబును కలిసి చెపితే సరిపోయేది.. ప్రెస్‌మీట్ పెట్టి రాజద్రోహం అంటూ బహిరంగ వ్యాఖ్యలు చేయడం సరికాదనే వారు ఉన్నారు.
ఇక టీడీపీ సోషల్ మీడియా వాళ్లు చెపుతున్నట్టు వ్యవస్థలను కించ పరిచేలా చేయకూడదని... వ్యవస్థలను కాపాడితేనే అవి మనలను కాపాడతాయి అనే వాళ్లు కూడా ఉన్నారు. ఏదేమైనా టీడీపీలో పార్టీ వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఈ రెండిటి మధ్య చక్కని సమన్వయం అవసరం.