
అప్పటి అధికార వైసీపీని ఓడించేందుకు ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలు అమలవుతున్నాయి. కొన్ని రోజుల్లో తల్లికి వందనంతో పాటు రైతు భరోసా స్కీమ్ లు అమల్లోకి రానున్నాయి.
రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు 20వేల రూపాయల ఆర్థిక సాయం చేయనుంది ప్రభుత్వం. తాజాగా ఈ స్కీమ్ అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర రైతులకు ఆర్థిక భరోసా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. త్వరలో రైతు భరోసా అమలు చేస్తామన్నారు. కేంద్రం అందించే 6వేలతో పాటు అదనంగా రూ. 14,000ను మూడు విడతల్లో రైతులకు చెల్లిస్తామన్నారు.
ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం అని చెప్పాం. మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తాం. ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. త్వరలో రైతుభరోసా అమలు చేస్తాం. కేంద్రం తర్వాత విడతలో ఇచ్చే డబ్బుతో కలిపి అన్నదాత సుఖీభవ కింద 3 విడతల్లో 20వేల రూపాయలు ఇస్తాం. ప్రతి రైతుకు రైతుభరోసా కింద 20వేలు ఇస్తాం.
ఇక మత్స్యకారులకు 20వేలు ఇస్తామన్నాం. చేపల వేటకు వెళ్లని పరిస్థితి ఉంటుంది. ఏటా హాలీడే ఇస్తాం. ఆ హాలీడే సమయం ముందుగానే వారికి ఇవ్వాల్సిన 20వేల రూపాయల ఆర్థిక సాయం చేసి వారిని కూడా ఆదుకుంటాం. ఇప్పటికే డీఎస్సీ అనౌన్స్ చేశాం. త్వరలోనే దానికి కూడా శ్రీకారం చుడతాం. ఇచ్చిన హామీ మేరకు 16,384 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
అలాగే నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు భృతి ఇస్తాం పేదరికం లేని సమాజమే మా లక్ష్యం. ఇళ్లు లేని పేదలకు ఐదేళ్లలో ఇళ్లు నిర్మిస్తాం. గ్రామీణ పేదలకు 3 సెంట్ల ఇంటి స్థలం ఇస్తాం. ఉగాది రోజున పీ-4 విధానాన్ని ఆవిష్కరిస్తాం. 20 లక్షల ఉద్యోగాల కల్పన మా ప్రభుత్వ బాధ్యత. రూ.6.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ పూర్తి చేశాం. తాజా పెట్టుబడుల ద్వారా 5లక్షల ఉద్యోగాలు వస్తాయి' అని సీఎం చంద్రబాబు చెప్పారు.