తెలంగాణలో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ టీం.. బీ టీం వంటి పదాలు బాగా వినిపించాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లింది. ఇది ఆ పార్టీకి బాగా లాభం చేకూర్చింది.  దానికి కారణం లేకపోలేదు. లిక్కర్ స్కాంలో కవితను అరెస్టు చేయకుండా వదిలేయడం.. పార్టీ అధ్యక్షుడిని మార్చడం బీజేపీకి కూడా మైనస్ గా మారాయి. కానీ వీటి నుంచి బయట పడి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ బలంగా పుంజుకొంది.


అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల నగరా మోగింది. ఎమ్మెల్సీ పోరులో బీజేపీ, కాంగ్రెస్ లు  హోరాహోరాగా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి కుమ్మక్కు రాజకీయాలు తెరపైకి వచ్చాయి.  రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీలు ఒకరితో ఒకరు కుమ్మక్కు అయ్యారంటూ ఆరోపణలు చేసుకోవడం ఆసక్తికరంగా మారుతోంది. 


కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయంటూ బీజేపీ, కాదు బీఆర్ఎస్ తోనే కమలం పెద్దలు కుమ్మక్కు అయ్యారంటూ హస్తం నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.   ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లె సాధారణ ఎన్నికలకు మించిన స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలు ప్రచారం చేయడం ఈ ఎన్నికల్లో హైలెట్ గా నిలుస్తోంది.  


ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయంటూ బీజేపీ.. గులాబీ-కమలం చేతులు కలిపాయని కాంగ్రెస్ ఆరోపణలు చేసుకుంటుండటం ఆసక్తికరంగా మారింది.  ఫోన్ ట్యాపింగు కేసులో బీఆర్ఎస్ ముఖ్యనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు అరెస్టు కాకుండా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కాపాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాకు పారిపోతే ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఆ ఇద్దరిని బీజేపీ తీసుకువస్తే, తాము 48 గంటల్లో బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చాలెంజ్ చేశారు.  


కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు అవడం వల్లే ఫోన్ ట్యాపింగ్ కేసు నిర్వీర్యం అయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఫోన్ ట్యాపింగు కేసును సీఎం రేవంత్ రెడ్డి వదిలేసినా, తాము విడిచిపెట్టమని స్పష్టం చేశారు. బండి సంజయ్ కూడా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పారిపోతే ఇక్కడున్న కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావును అరెస్టు చేయొచ్చు కదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.  ఇలా తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై కుమ్మక్కు రాజకీయం రసకందాయంగా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp