
ఆంధ్రప్రదేశ్ అధికారులు హాజరు కాకపోవడంతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం ఇవాళ మరోసారి జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటి విడుదల కోసం బోర్డు ప్రత్యేక సమావేశం నిన్న హైదరాబాద్ జలసౌధలో జరిగింది. ఛైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, ఇంజనీర్లు మాత్రమే హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి అధికారులు ఎవరూ సమావేశానికి హాజరు కాలేదు. ఆన్ లైన్ విధానంలో హాజరయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఏపీ అధికారులు మాత్రం హాజరు కాలేదు. విచిత్రం ఏంటంటే.. ఈ సమావేశానికి ముందు నల్గొండ, ఒంగోలు చీఫ్ ఇంజనీర్లు మాత్రం జలసౌధలోనే భేటీ అయ్యారు. ప్రస్తుతం ఉన్న పంటలను దృష్టిలో ఉంచుకొని మే నెలాఖరు వరకు అవసరమయ్యే నీటికి సంబంధించి నివేదిక ఈ అధికారులు సిద్ధం చేశారు.
తమకు 63 టీఎంసీలు కావాలని తెలంగాణ కోరింది. అయితే తమకు 55 టీఎంసీలు అవసరమని ఏపీ కోరింది. అయితే బోర్డు సమావేశానికి ఏపీ అధికారులు హాజరు కాకపోవడంపై రాహుల్ బొజ్జా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఏపీ అధికారులు గైర్హాజరయ్యారని రాహుల్ బొజ్జా అన్నారు. ఏపీ సీఈ జలసౌధలోనే ఉండి కూడా సమావేశానికి రాలేదని రాహుల్ బొజ్జా వ్యాఖ్యానించారు.
ఇప్పటికే వాటాకు మించి కృష్ణా జలాలను తీసుకున్నారని, ఇంకా తీసుకుంటున్నారని రాహుల్ బొజ్జా అన్నారు. తన వాదనను మినిట్స్ లో రికార్డు చేసి కేంద్ర జలశక్తి శాఖకు పంపాలని రాహుల్ బొజ్జా కోరారు. శ్రీశైలం నుంచి నీరు తీసుకోవద్దని బోర్డు చెబితే పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రిని ఆపిన ఆంధ్రప్రదేశ్ అధికారులు మల్యాల నుంచి తీసుకుంటున్నారని రాహుల్ బొజ్జా ఆక్షేపించారు.
మల్యాల నుంచి కూడా ఏపీ నీరు తీసుకోకుండా ఆపాలని, నాగార్జునసాగర్ కుడి కాల్వ నుంచి తీసుకునే నీటిని కూడా 5000 క్యూసెక్కులకు తగ్గించేలా చూడాలని బోర్డును రాహుల్ బొజ్జా కోరారు. ఇవాళ ఉదయం 11 గంటలకు మరోమారు సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. నీటి విడుదలకు సంబంధించి సమావేశంలో నిర్ణయం తీసుకుంటానని బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్ తెలిపారు. మరి ఇవాళ కూడా ఏపీ అధికారులు రాకపోతే అది తెలంగాణకే అనుకూలంగా మారవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.