
రాష్ట్రవ్యాప్తంగా సీజన్ యాసంగి సీజన్ మొదలు నుంచి ప్రారంభ నిల్వలతో కలిపి 9.08 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రైతులు కొనుగోలు చేశారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 8.54 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకుగాను 7.27 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే రైలు, రోడ్డు మార్గం ద్వారా సరఫరా చేసింది. యాసంగి సీజన్ ముందస్తుగా ప్రారంభమవడం, మొక్కజొన్న, వరి పంటల సాగు విస్తీర్ణం గత యాసంగి సీజన్ కంటే 6.25 లక్షల ఎకరాలు అధికంగా సాగు కావడంతో గత యాసంగితో పోల్చితే ఈ సారి 1.99 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా రైతులు కొనుగోలు చేశారు.
యూరియా ప్రణాళికలో దిగుమతులు ద్వారా కేటాయింపుల్లో యూరియా, దేశీయ యూరియా కేటాయింపుల్లో ప్లాన్ ప్రకారం రాకపోవడంతో 1.27 లక్షల మెట్రిక్ టన్నులు తక్కువగా సరఫరా జరిగిందని తెలంగాణ వ్యవసాయ శాఖ వెల్లడించింది. రైతుల అవసరాలు దృష్టిలో పెట్టుకుని మార్చి నెలకుగాను 1.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా దేశీయ కంపెనీల నుంచి సరఫరా చేయాలని సర్కారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. నేటి వరకు 1.11 లక్షల టన్నుల యూరియా నిల్వలు రాష్ట్రవ్యాప్తంగా రైతులకు అందుబాటులో ఉన్నాయని తెలియజేసింది.
ఎప్పటికప్పుడు కేంద్ర ఎరువుల విభాగంతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతూ రైతులకు కావాల్సిన యూరియా ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. యూరియా సరఫరాలో ఎలాంటి అంతరాయ లేకుండా ప్లాన్ ప్రకారం రైతుల అవసరాలు మేరకు పంపించాలంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి రెండు సార్లు లేఖలు రాశారు.