తెలంగాణలో ప్రస్తుతం మూడు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ జిల్లాల పట్టభద్ర నియోజకవర్గానికి జరుగుతున్న ఎమ్మెల్సీ కాంగ్రెస్ కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఎందుకంటే ఇది అధికార పార్టీ సిట్టింగ్ స్థానం.  ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు వేయనుండటంతో ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం ఎలా ఉందో తేలిపోతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


కొత్తగా ఏర్పాటు చేసిన 33 జిల్లాల్లో దాదాపు సగం అంటే 15 జిల్లాల ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. అదే సమయంలో ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల తర్వాత.. స్థానిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నిక సెమీ ఫైనల్స్ అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.  ఆయనకు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరిక్రిష్ణ గట్టి పోటీ ఇస్తున్నారు.  


ప్రధాన ప్రతిపక్షం ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. ఈ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీతోపాటు బీఆర్ఎస్ కు చెప్పుకోదగ్గ స్థాయిలో ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా బీఆర్ఎస్ రేసులో లేనందున ఆ పార్టీ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఉత్కంఠ రేపుతోంది.  మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఈ ఎన్నికలను తేలిగ్గా తీసుకున్నట్లు కనిపించడం లేదు.  ఎన్నడూ లేనట్లు పట్టభద్ర ఎమ్మల్సీ ఎన్నికకు ముఖ్యమంత్రి స్థాయి నేత ప్రచారం చేయడం ఆ పార్టీ ఈ ఎన్నికను ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందో తెలియజేస్తోందని అంటున్నారు.  ఇక ఏడుగురు మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలకు ఎన్నిక బాధ్యతలను అప్పగించారు.  


అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది.  ఉద్యోగాల భర్తీకి పెద్దపీట వేశామని.. నిరుద్యోగులు తమవైపు ఉన్నారని నమ్మకం పెట్టుకుంటోంది.  కుల గణన నిర్వహించి బీసీలకు ప్రాధాన్యమిస్తామని ప్రచారం చేసుకుంటోంది.  బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో ఖాతా తెరవాలని కుతూహులం ప్రదర్శిస్తోంది. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, సీనియర్ నేత ఈటల స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు.  ఏదిఏమైనా ఈ ఎన్నికలో గెలిచిన పార్టీకి వచ్చే స్థానిక ఎన్నికల్లో మంచి అవకాశాలు ఉంటాయంటున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఇది అగ్ని పరీక్షగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: