
బిహార్ కేంద్రంగా రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. బిహార్ లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా కేంద్ర బడ్జెట్ లో ప్రధాని మోదీ సైతం అధిక ప్రాధాన్యం కేటాయించారు. భారీ వరాలు ప్రకటించారు. మరోవైపు కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో నితీశ్ కుమార్ ప్రస్తుతం కీలక భూమిక పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఓ ఆసక్తికర డిమాండ్ తెరపైకి వచ్చింది.
రాబోయే ఎన్నికలకు ఎన్డీయే సీఎం అభ్యర్థిగా నితీశ్ పేరు ప్రకటించాలని ఆయన కుమారుడు నిశాంత్ డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఎన్నికలకు ముందే ఈ ప్రకటన చేయాలని కోరారు. ఫలితంగా.. బీహార్ లో కూటమి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో... ఇప్పటికే రికార్డ్ స్థాయిలో తొమ్మిదిసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ పేరు మరోసారి ప్రకటించాలనే కోరికపై బీజేపీ రియాక్షన్ ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్.. తన మంత్రివర్గ విస్తరణకు సిద్ధం అయ్యారు. తన మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు. కొత్తగా నలుగురు బీజేపీ, ఇద్దరు జేడీయూ ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం దక్కనుందని తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కడంతో రెవెన్యూ మంత్రి దిలీప్ జైస్వాల్.. తన మంత్రి పదవిని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. ఇప్పుడు ఖాళీగా ఉన్న మంత్రుల స్థానాలను భర్తీ చేయాలని నితీశ్ నిర్ణయించారు.
శుక్రవారం నుంచి బిహార్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక నితీశ్ కుమారుడు తాజాగా ఎన్డీయే సీఎం అభ్యర్థిగా నితీశ్ పేరు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందే ఈ ప్రకటన చేయాలని కోరారు. దీని ద్వారా తిరిగి కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిశాంత్ కొంత కాలంగా రాజకీయ వ్యవహారాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. 2020లో బిహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 43 సీట్లు గెలుచుకోగా.. బీజేపీ 73 సీట్లు గెలుచుకుంది. ఆర్జేడీ 75 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది.