
మహా కుంభమేళా విజయవంతంగా ముగిసింది. దాదాపు 66 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు. ఈ విజయంలో రైల్వేలది కీలక పాత్ర. ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే 17,152 రైళ్లను నడిపించిందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మహా కుంభమేళాలో లక్షలాది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంలో కీలకపాత్ర పోషించిన ప్రతి ఒక్క రైల్వే సిబ్బందికి అశ్వనీ వైష్ణవ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ముందుగా కుంభమేళాకు 13,000ల రైళ్లను నడిపించాలని అనుకున్నారు. ఆ తర్వాత మరో నాలుగువేల పైచిలుకు అదనపు రైళ్లను పెంచారు. యాత్రికులు తమ గమ్యస్థానాలకు సజావుగా చేరుకునేలా రైల్వే అధికారులు చక్కని ప్రణాళిక చేశారు. మహా కుంభమేళా-2025కు భారీ సంఖ్యలో యాత్రికులు వచ్చారు. సుమారు 66 కోట్ల యాత్రికులు తరలివచ్చారని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.
ప్రయాగ్ రాజ్ లోని తొమ్మిది కీలక రైల్వే స్టేషన్ల నుంచి 4.24 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించారు. మహా కుంభమేళా - 2025 కోసం భారతీయ రైల్వే 17,152 రైళ్లను నడిపించింది. 7,667 ప్రత్యేక రైళ్లు, 9,485 సాధారణ రైళ్లు ఉన్నాయి. ప్రయాగ్ రాజ్‌లోని తొమ్మిది కీలక స్టేషన్లలో విస్తృతమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రయాణికులకు అదనంగా రెండవ ప్రవేశ ద్వారాలు, 48 ప్లాట్ ఫారమ్‌లు, 21 పాదచారుల వంతెనలను ఏర్పాటు చేశారు.
డ్రోన్ ల పర్యవేక్షణతో సహా 1,186 సి. సి.టి.టీవి కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు. అత్యంత రద్దీ సమయాల్లో రద్దీని నిర్వహించడానికి, 23 శాశ్వత హోల్డింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. 23 భాషలలో బహుభాషా ప్రకటనలు, కరపత్రాల పంపిణీతో ప్రయాణీకులకు సులభమైన కమ్యూనికేషన్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రయాణికుల సౌకర్యార్థం 151 మొబైల్ యూ.టి.ఎస్ కౌంటర్లు, క్యూఆర్ -ఆధారిత వ్యవస్థతో సహా 554 కౌంటర్లతో టిక్కెట్ సౌకర్యాలు కల్పించారు.