కేసుల వల్ల పెండింగులో ఉన్న తమ ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించాలని ఎమ్మార్ ప్రాపర్టీస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆశ్రయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ఎమ్మార్ ప్రాపర్టీస్ ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు.


దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ సంస్థ 2001లో కన్వెన్షన్ సెంటర్, హోటల్, గోల్ప్ కోర్సులు, విల్లాల నిర్మాణం కోసం ఏపీఐఐసీతో ఒప్పందాలు చేసుకుంది.  ఒప్పందాల్లో అక్రమాల వల్ల ఏపీఐఐసీకి భారీ నష్టం కలిగించిందన్న ఆరోపణలపై ఎమ్మార్ పై సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసింది. సీబీఐ, ఈడీ, ఇతర విచారణ సంస్థల కేసులు కోర్టుల్లో వివిధ దశల్లో ఉన్నాయి.


ఎమ్మార్ వివాదాల పరిష్కారం కోసం తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015 అక్టోబరులో ప్రభుత్వం సీఎస్ నేతృత్వంలో అయిదుగురు కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర విదేశాంగ శాఖ, సొలిసిటర్ జనరల్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు ఇచ్చారు. ఎమ్మార్ వివాదాలు, సీబీఐ, ఈడీ, కోర్టు కేసుల వివరాలు, వివాదాల పరిష్కారంపై గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తదితర అంశాలను అధికారులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తెచ్చారు.


దర్యాప్తు సంస్థల విచారణ, కోర్టుల్లో కేసులు, న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున ఒప్పంద పత్రాలు, కేంద్రం సూచనలు, తదితర వివరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గతంలో సీఎస్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీతో పాటు న్యాయనిపుణులతో మరో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కమిటీతో చర్చించి సూచనలు ఇచ్చేందుకు.. యూఏఈ ప్రభుత్వ ఆమోదంతో తాము లీగల్ ఏజెన్సీ ఏర్పాటు చేస్తామని ఎమ్మార్ ప్రతిపాదించగా.. సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారు. మరి ఈ భేటీ తర్వాతైనా ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ కష్టాలు తీరతాయా అన్నది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: