
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో స్థానికత కోటాను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని వృత్తి విద్యా కోర్స్ లకు సంబంధించి 85% సీట్ లు తెలంగాణ స్థానిక విద్యార్థులకు రిజర్డ్వ్ కోటాగా పేర్కొంది. మరో 15 శాతం ఆన్ రిజర్డ్వ్ కోటా గా పరిగణించింది. అయితే ఆన్ రిజర్డ్వ్ కోటా లోని సీట్ లకు తెలంగాణ లో కనీసం 10 ఏళ్ళు నివసించిన , రాష్ట్రంలో పని చేస్తున్న కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, లేదా ఉద్యోగుల భాగస్వాములు పోటీ పడేందుకు అవకాశం ప్రభుత్వం కల్పించింది.
స్థానికత అంశంపై ఇప్పటికే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కారు... ఆ కమిటీ నివేదిక ఆధారంగా కోటా కేటాయించినట్టు పేర్కొంది. ఇప్పటి వరకు ఆయా వృత్తి విద్యా కోర్స్ లలో 15% ఎపి విద్యార్థులు పోటీ పడేవారు. ఏపీ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం .. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో ఈ విద్య సంవత్సరం నుంచి స్థానికత అమలు పై సర్వత్రా చర్చ జరుగుతోంది.
పలు పిజి, వృత్తి విద్యా కోర్స్ లకు సంబంధించిన నోటిఫికేషన్స్ సైతం విడుదల చేసింది తెలంగాణ సర్కారు. ఆయా నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంలోపే స్థానికత అంశంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక ఏపీ స్థానికత ఉన్నవారికి తెలంగాణలో ఉన్నత విద్యలో సీట్లు లేనట్టే భావించాలి.