
రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ది చెందుతుందని మోదీ భావించారని బీజేపీ ఎంపీలు గుర్తు చేశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కాంగ్రెస్ ప్రభుత్వం ముసివేస్తే.. మోది తెరిపించారన్నారు. రేవంత్ రెడ్డి పాలన తుగ్లక్ పాలనను తలపిస్తుందని బీజేపీ ఎంపీలు విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం, మోదీ, కిషన్ రెడ్డిని విమర్శించడం మంచిది కాదని బీజేపీ ఎంపీలు హితవు పలికారు. మోడీని విమర్శిస్తే రేవంత్ రెడ్డి ప్రతిష్ఠ పెరగదని భస్మం అయిపోతారని బీజేపీ ఎంపీలు హెచ్చరించారు. బడ్జెట్ లో యూపీతో పాటు ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణకే ఎక్కువ నిధులు వచ్చాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలు, స్థానిక సంస్థలకు ఒక్కపైసా కూడా ఇవ్వడం లేదని బీజేపీ ఎంపీలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సరిగా వినియోగించడం లేదని బీజేపీ ఎంపీలు అన్నారు. ఎస్ఎల్బీసీ లో 8 మంది కార్మికులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేయాల్సిందిపోయి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి కప్పం కట్టడానికి ఢిల్లీకి వెళ్తున్నారని బీజేపీ ఎంపీలు ఆరోపించారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పదేళ్ల బీఆర్ఎస్ కుంభకోణాలపై సీబిఐ విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఓవైపు బీజేపీ ఎంపీల మాటలు ఇలా ఉంటే.. అటు రేవంత్ రెడ్డి చెప్పేది మాత్రం మరోలా ఉంది. మరి ఎవరి మాటలు నమ్మాలన్నది జనం తేల్చుకోవాల్సిన అంశంగా మిగిలింది.