
బ్యాంకర్లతో కలిసి సుమారు 6,000 కోట్ల రూపాయల విలువైన ఉపాధి పథకాలు మార్చి 2న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వనపర్తిలో ప్రారంభించబోతున్నారు. స్వయం ఉపాధి పథకాల పంపిణీ, సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఓ పండుగలా నిర్వహిస్తోంది. ఇవి రాష్ట్ర జీడీపీని పెంచుతాయి. రైజింగ్ తెలంగాణలో బ్యాంకర్స్ పాత్ర కీలకం. ప్రపంచాన్ని ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
స్కిల్ యూనివర్సిటీ, ఐటీఐల అడ్వాన్స్మెంట్ ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరులు, రెప్పపాటు కూడా అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తు సరఫరా, శాంతి భద్రతలు మంచి వాతావరణం కల్పించి ప్రపంచాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో రైతులతోపాటు బ్యాంకర్లకు మేలు జరిగిందని, సింగిల్ ఖాతా ద్వారా 22 వేల కోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయి. సింగిల్ స్ట్రోక్‌తో పెద్ద మొత్తంలో బ్యాంకర్లకు రికవరీ జరిగింది.
రైతుభరోసా కింద ఇప్పటికే 11,500 కోట్ల రూపాయలు, రైతుబీమా కింద 1,500 కోట్ల రూపాయలు, రైతులకు ఉచిత విద్యుత్తు పథకం కింద రాయితీ మొత్తం 11 వేల కోట్ల రూపాయలు, సన్న ధాన్యం బోనస్‌గా 1,800 కోట్ల రూపాయలు... ఇవి కాకుండా కేంద్ర ప్రాయోజిత పథకాలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం ద్వారా ఇండస్ట్రియల్, ఫార్మా, హౌసింగ్ క్లస్టర్లు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నారు. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వెల్లువెత్తుతాయి.
హైదరాబాద్ బేగంపేట మ్యారీగోల్డ్ హోటల్లో జరిగిన 44వ త్రైమాసిక రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో ఈ వివరాలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. వ్యవసాయ రంగం బ్యాంకింగ్ సేవలు, రుణాల మంజూరుపై విస్తృతంగా చర్చించారు. గత ఖరీఫ్, తాజా యాసంగిలో రైతులకు అందుతున్న ఆర్థిక సహాయం, పథకాల అమలుపై సమగ్రంగా చర్చించారు.