తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతోంది. మొదట కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. దానికి బదులిచ్చిన కిషన్ రెడ్డి.. రాష్ట్రాలకు ప్రాజెక్టుల మంజూరు చేయడానికి కేంద్రానికి ఒక విధానముంటుందని అన్నారు. సీఎం అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారన్న కిషన్ రెడ్డి అన్నారు. మళ్లీ దీనిపై రేవంత్ రెడ్డి స్పందించారు.


కిషన్ రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతరహితమంటూ రేవంత్ రెడ్డి లేఖతో బదులిచ్చారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా.. సమాఖ్య విధానానికి కట్టుబడి.. పూర్తి పారదర్శకంగా పాలన సాగిస్తున్నామని లేఖలో సీఎం పేర్కొన్నారు. మెట్రో రెండో దశ, ఆర్ఆర్ఆర్, రీజనల్ రింగ్ రైలు, మూసీ పునరుజ్జీవనం, డ్రైపోర్టు వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్ర విధివిధానాలను పూర్తిగా పాటిస్తున్నామని సీఎం తెలిపారు. ప్రాజెక్టుల కోసం ప్రధాని, ఇతర కేంద్ర మంత్రులతో పాటు కిషన్ రెడ్డిని కూడా కలిసినట్లు లేఖలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు.


హైదరాబాద్ నలుమూలలా అభివృద్ధి చేసే లక్ష్యంతో తమ ప్రభుత్వం 24 వేల 269 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన అయిదు కారిడార్లకు ఆమోదం తెలపాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు హర్‌దీప్‌ సింగ్ పురీ, మనోహర్‌ లాల్ ఖట్టర్ తో కిషన్ రెడ్డిని కూడా కలిసి కోరినట్లు తెలిపారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నప్పడే బెంగళూరు, చెన్నై మెట్రో రైలుకు కేంద్రం అనుమతిచ్చిందని సీఎం గుర్తు చేశారు.


కేంద్ర మంత్రిగా 2019 నుంచి కొనసాగుతున్నందున.. రాష్ట్ర ప్రాజెక్టులను అనమతులు, నిధులు సాధించడం కిషన్ రెడ్డి నైతిక బాధ్యతగా లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చెన్నై, బెంగళూరు మెట్రోకు ఆమోదం తెలిపిన కేంద్రం.. తాము ఎన్నిసార్లు కోరినా.. హైదరాబాద్ మెట్రో రెండో దశను పట్టించుకోవడం లేదన్నారు. గుజరాత్ సబర్మతీ, యూపీలో గంగా పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రశంసిస్తూ వ్యాసాలు రాసిన కిషన్ రెడ్డి.. మూసీ ప్రాజెక్టుపై మాత్రం విషం చిమ్మడం ద్వంద్వ వైఖరేనన్నారు. ఆర్ఆర్ఆర్, డ్రైపోర్టు, రీజనల్ రింగు రైలు విషయంలోనూ కిషన్ రెడ్డి పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని... అదే విషయం ప్రస్తావిస్తే... తాను అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నానంటూ.. అడిగి హామీలు ఇచ్చారా అంటూ విమర్శించడం అభ్యంతరకరమన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: