
ఒకవైపు విద్య, ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖలను సమర్ధవంతంగా ముందుకు నడిపిస్తున్న మంత్రి నారా లోకేష్ .. తన సొంత నియోజకవర్గం మంగళగిరి పై బాగా ఫోకస్ పెట్టారు. వారానికి రెండు సార్లు తన నియోజకవర్గం లో ఆయన పర్యటిస్తున్నారు. ఏదైనా కారణంతో వారానికి రెండుసార్లు కుదరకపోతే . . కనీసం ఒక్కసారైనా నియోజకవర్గంలో రాజకీయాల పైన , ప్రజల పరిస్థితుల పైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి లో ఓటమి తర్వాత లోకేష్ రాటు దేలిన రాజకీయం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో నే అక్కడ పట్టు సాధించి 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీ తో ఘన విజయం సాధించారు.
చేనేతలు దండిగా ఉన్న ఈ నియోజకవర్గంలో.. వారిని ప్రోత్సహిస్తున్నారు. చేనేత ల శాఖా మంత్రి సవితతో సమన్వయం చేసుకుంటూ .. చేనేత వస్త్రాలకు దేశవ్యాప్తంగా మార్కెటింగ్ కల్పించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మంగళగిరి ప్రజల చిరకాల కోరిక కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. 30 ఏళ్ళు గా తమ నియోజకవర్గంలో అతిపెద్ద ఆసుపత్రి నిర్మాణం కావాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. వంద పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఇది వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేసుకుంటే మంగళగిరి పై నారా లోకేష్ ప్రత్యేకముద్ర వేసినట్టు అవుతుంది. ఇక నియోజకవర్గం లోని మండలాలలో రహదారుల నిర్మాణం జోరుగా సాగుతోంది. అన్న క్యాంటీన్ల సంఖ్య ప్రస్తుతం 12 ఉండగా.. వీటిని 25 చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ని కూలీలు , విద్యార్థులు, రోజువారి కార్మికులకు వీటి వల్ల ఎంతో ఉపయోగముంటుంది. ఏది ఏమైనా మంగళగిరి అభివృద్ధికి లోకేష్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు అన్నది వాస్తవం.