
ఏపీలోని చంద్రబాబు సర్కారు రాష్ట్ర బడ్జెట్ శుక్రవారం ప్రవేశ పెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తి బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టింది. అయితే ఈ బడ్జెట్లో సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యం లభించింది. రాజకీయంగా పట్టు సాధించే క్రమంలో సంక్షేమ రంగానికి భారీగా కేటాయింపులు చేసినట్లు స్పష్టం అవుతోంది.
ముఖ్యంగా బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. 2019 ఎన్నికల్లో టీడీపీ వర్గాలుగా ఉన్న బీసీలు వైయస్సార్ కాంగ్రెస్ వైపు వెళ్లారు. దానిని పదిలం చేసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి బీసీలకు అనేక పథకాలు ప్రకటించారు. గత ఎన్నికల్లో తన సొంత సామాజిక వర్గాన్ని కాదని మరీ బీసీలకు సీట్లలో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అయినా బీసీలు ఆయన్ను ఆదరించలేదు. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమికి మద్దతు తెలిపారు.
అయితే బీసీలు మరోవైపు ఇతర పార్టీల వైపు చూడకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం వారికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. వారికోసం భారీగా నిధులు కేటాయించింది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 13,487 కోట్లు కేటాయించారు. పౌరసరఫరాల శాఖకు రూ.3806 కోట్లు కేటాయింపులు జరిపారు. ఇక ఎస్సీల సంక్షేమానికి ఏకంగా రూ.20,281 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.8159 కోట్లు, బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు, అల్పసంఖ్యాక వర్గాల కోసం రూ.5434 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు. మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ.4332 కోట్లు బడ్జెట్లో కేటాయించారు.
బీసీ సంక్షేమానికి మాత్రం అధిక ప్రాధాన్యం ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ప్రతిసారి బీసీలకు ప్రత్యేక పథకాలు ప్రకటించేవారు. రాయితీపై రుణాలు అందించేవారు. మరోసారి అదే ప్రయత్నం చేయనుంది టీడీపీ కూటమి ప్రభుత్వం. భారీగా నిధులు కేటాయించిన నేపథ్యంలో ఈ ఐదేళ్లపాటు రాయితీ రుణాల పంపిణీ ప్రక్రియ కొనసాగనంది. మరోసారి బీసీలు ఇతర రాజకీయ పార్టీల వైపు చూడకుండా ఉండేందుకు ఈ కేటాయింపులు దోహద పడనున్నాయని కూటమి ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. బీసీలకు ప్రాధాన్యం ఇచ్చిన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలు అసంతృప్తికి గురికాకుండా ఆ రెండు సామాజిక వర్గాలకు సైతం ప్రాధాన్యం ఇచ్చారు.