
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా.. ప్రాధాన్యత దక్కేలా.. ఏపీ విద్యార్థులకు షాక్ ఇచ్చారు. ఇంజినీరింగ్‌తోపాటు ఇతర వృత్తివిద్యా కోర్సుల్లో అమలవుతున్న 15 శాతం నాన్ లోకల్ కోటా(అన్ రిజర్వుడు)లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని సీట్లు తెలంగాణ విద్యార్థులకే కేటాయించనున్నారు.
ఇకపై ఆ సీట్లకు ఆధ్రప్రదేశ్‌విద్యార్థులు పోటీ పడే అవకాశం లేకుండా చేశారు. ఈ మేరకు పదేళ్లుగా అమలవుతున్న 15 శాతం అన్ రిజర్వుడ్ కోటాకు రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసినట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితా రాణా జీవో జారీ చేశారు. 15 శాతం అన్ రిజర్వుడు కోటాకు అర్హులు ఎవరనేది స్పష్టత ఇస్తూ జీవో ఇచ్చారు.
రాష్ట్ర విభజన సమయంలో విద్యాసంస్థల్లో పదేళ్లపాటు 15 శాతం నాన్‌లోక్ కోటా అమలు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదల చేశారు. 2024 వరకు 15 శాతం నాన్‌లోకల్ కోటా కింద ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ విద్యార్థులు పోటీ పడేవారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు 2024తో పూర్తయింది. వాస్తవానికి గత విద్యాసంవత్సరం నుంచే 15 శాతం కోటా రద్దు అమలు చేయాలి. కానీ కొన్ని కారణాలతో నాన్‌లోకల్ కోటా అమలు చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి స్థానికులకే అవకాశం కల్పించేలా ప్రొఫెషనల్ కాలేజీల్లో అడ్మిషన్స్ గైడ్‌లైన్స్‌లో సవరణ చేస్తూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో మాదిరిగానే కన్వీనర్ కోటా 70 శాతం సీట్లలో 85 శాతం సీట్లను స్థానికులకు అంటే ఓయూ రీజియన్(తెలంగాణ రాష్ట్ర పరిధి) అభ్యర్థులకు కేటాయిస్తారు. 15 శాతం స్థానికేతర కోటాపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 2011లో జారీ చేసిన జీవో 74 ప్రకారం నాన్ లోకల్ కోటాకు ఓయూ రీజయన్‌తోపాటు ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులు పోటీ పడవచ్చు. అయితే తాజా జీవోలో ఏయూ, ఎస్‌కేయూలను తొలగించింది. ఓయూ రీజియన్ వాళ్లకు మాత్రమే అవకాశం ఉంటుంది.
స్థానికతను గుర్తించేందుకు తెలంగాణలో గతంలో మాదిరిగానే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువును ప్రామాణికంగా తీసుకుంటారు. బీటెక్, బీఫార్మసీ, బీఎస్‌సీ అగ్రికల్చర్, బీఎస్‌సీ వెటర్నరీ సైన్స్ లాంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు తెలంగాణలో 9, 10, 11, 12 తరగతులు (నాలుగేళ్లు) విద్యాభ్యాసం చేసిన విద్యార్థులను కూడా స్థానికులుగానే గుర్తిస్తారు. 9 నుంచి ఇంటర్ వరకు వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలో చదవకుంటే.. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు.. ఏడేళ్ల చదువులో నాలుగేళ్లు తెలంగాణ రాష్ట్రంలో చదవాలి.. తాజా సవరణల నేపథ్యంలో ఏటా నాన్‌లోకల్ కోటా కింద ఏపీ విద్యార్థులు సుమారు 60 వేల మందికిపైగా కన్వీనర్ సీట్లు పొందుతారు.