రెండు తెలుగు రాష్ట్రాల్లో బుక్ ల హవా కొనసాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ కార్యకర్తలను పోలీసులు, అధికారులు, నాయకులు ఇబ్బంది పెట్టారని ఆరోపిస్తూ వారి వివరాలను రెడ్ బుక్ లో రాసుకుంటున్నామని.. అధికారంలోకి రాగానే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్నట్లుగానే అధికారంలోకి రాగానే వారిపై చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు.


ఇక అప్పటి నుంచి బుక్ ల వ్యవహారం తెగ నడుస్తోంది. ఈ సంస్కృతి తెలంగాణకు కూడా వ్యాపించింది. బీజేపీ కాషాయ బుక్ మెయిన్ టైన్ చేస్తున్నామని ప్రకటించింది. ఇక తామేమీ తక్కువ కాదన్నట్లు బీఆర్ఎస్ పింక్ రాస్తున్నట్లు ప్రకటించింది. రేవంత్ ప్రభుత్వంలో అధికారులు, పోలీసులు తమ కార్యకర్తలను ఇబ్బంద పెడుతున్నారని కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.    


బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేసిన వారి చిట్టా పింకు బుక్‌లో రాస్తామని... టైం వచ్చినప్పుడు అందరి సంగతి తేలుస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. కొల్లాపూర్ మండలం సింగోటంలో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో కలిసి ఆమె పర్యటించారు.  ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై, మంత్రి జూపల్లిపై విమర్శలు గుప్పించడం హాట్ టాపిక్ గా మారింది.


ఒక ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలు ఇంకొక ప్రభుత్వంలో కొనసాగాలని.. వాటితో ప్రజలకు లాభం జరగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.  కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతున్న బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ఆమె అన్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్త శ్రీధర్ రెడ్డిని హత్య చేశారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్ నాయకులపై దాడులు జరుగుతున్నాయన్నారు.  సాతపూర్ గ్రామంలో మీటింగ్ కోసం ఫ్లెక్సీ కడుతుంటే బీఆర్ఎస్ కార్యకర్త పరమేష్‌పై దారుణంగా 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కలసి దాడి చేశారన్నారు.  సీఎం సొంత జిల్లా అయినప్పటికీ కేసుల విషయంలో పురోగతి లేకపోవడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.


జూపల్లి కృష్ణారావు టూరిజం మంత్రిగా కాకుండా కొల్లాపూర్ నియోజక వర్గానికి అప్పుడప్పుడు వస్తూ టూరిస్ట్ మంత్రిగా వ్యవహారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.  బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో కొల్లాపూర్ ప్రాంతంలో మామిడి మార్కెట్ మంజూరు చేస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: