టీడీపీలోని వైసీపీ కోవర్టులకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా గాని ఇన్ డైరెక్ట్ గా గాని పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు తేల్చి చెప్పారు. మీరు ఆ పని చేస్తే పాముకి పాలు పోసినట్టేనన్న చంద్రబాబు.. అలా చేసే వారి మొత్తం వివరాలను నేను తెప్పించుకుంటున్నానని హెచ్చరించారు.


పార్టీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు చేసిన ఈ కీలక వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నా చుట్టూ తిరగకండి..‌‌.. ప్రదక్షిణలు చేస్తే పదవులు రావన్న చంద్రబాబు...  పదవులు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి అంటే మీరు ప్రజలతో ఉండాలన్నారు. మాటలు కాదు ఓట్లు తెప్పించుకున్న వాడే విజేత.. నా చుట్టూ తిరుగుతూ వీరుడు శూరుడు అని పొగడ్తలు చేస్తే ప్రయోజనం ఉండదని చంద్రబాబు నేతలకు తేల్చి చెప్పారు.


జీడి నెల్లూరు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారాలన్న చంద్రబాబు.. డి నెల్లూరు సభ్యత నమోదులో 90వ ర్యాంకు ఉందన్నారు. ఈ లెక్కల్లో నాకు ఎమీ సంబంధం ఉండదన్న చంద్రబాబు.. చిత్రగుప్తుని లెక్కల్లాగా ఇక్కడ అన్ని రికార్డు అవుతుంటాయన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపిలు అందరి మీద ప్రజా అభిప్రాయ సేకరణ నిరంతరం కొనసాగుతూనే ఉందన్న చంద్రబాబు.. సోషల్ మీడియానే భవిష్యత్తు ఆయుధం... మనం చేస్తున్న పనులు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడానికి ఇదే సరైన వేదిక అని అన్నారు.


ఎక్కడ ఎన్ని పనులు పెట్టుకున్న కార్యకర్తలను కలవడం ఒక బాధ్యతగా పెట్టుకుంటానన్న చంద్రబాబు.. కార్యకర్తలకు గౌరవం ఇవ్వడమే కాదు అవసరమైతే కొరడా జులిపిస్తానని హెచ్చరించారు. కార్యకర్తలతో 45 సంవత్సరాల అనుబంధం నాది అని గుర్తు చేసుకున్న చంద్రబాబు.. గత ఎన్నికల్లో నా దగ్గర స్నేహితులను సైతం ప్రజా ఆమోదం లేదని పక్కన పెట్టానన్నారు.
 

సీటు ఇవ్వలేను కావాలంటే కాఫీ,టీ ఇస్తా‌‌‌ , డిన్నర్ పెడుతా... కాని పార్టీనీ త్యాగం చేయలేనని చెప్పానని చంద్రబాబు అన్నారు. ఇకపై నిరంతరం పార్టీ నేతలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా నా ప్రణాళికలు ఉంటాయని చంద్రబాబు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: