
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకే పోటా పోటీగా సన్నద్ధమవుతున్నాయి. ఇక నటుడు దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపించి కధన రంగంలోకి దిగారు. ఇటీవల పార్టీ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. అయితే ఆయన అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటారా? ఒంటరిగా ఎన్నికలకు వెళ్తారా? అనే ఊహాగానాల వ్యక్తం అవుతున్నాయి.
అయితే విజయ్ పార్టీకి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారు. ఆయన తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అన్నాడీఎంకేతో పొత్తు లేకుండానే టీవీకే తమిళనాడులో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. టీవీకే ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలని ఇటీవల జరిగిన ఆ పార్టీ వార్షికోత్సవంలో కూడా ప్రశాంత్ కిషోర్ సూచించారు.
''ప్రస్తుతానికైతే ఆ పార్టీ ఒంటిరిగానే ఎన్నికలను వెళ్లే ఆలోచనలో ఉంది. అందులో మార్పు ఉంటుందని నేను అనుకోవడం లేదు'' అని అన్నారు. డీఎంకే ఓటు బ్యాంకును ఎదుర్కోవాలంటే టీవీకేతో పొత్తుకు అన్నాడీఎంకే మొగ్గుచూపే అవకాశంపై అడిగినప్పుడు, అలాంటిదేమీ ఉండకపోవచ్చని అన్నారు. గతంలోని ఎలక్టోరల్ డాటా ఆధారంగానే భవిష్యత్ ఫలితాలు ఉంటాయని ఊహించరాదని చెప్పారు. డిఎంకే కూటమి గతంలో 47 శాతం ఓట్ల షేర్ సాధించిందని, అదే భవిష్యత్తులోనూ కొనసాగుతుందనే గ్యారెంటీ ఏమీ లేదని అన్నారు.
తమిళనాడులో మార్పు తేవాలనే ఆశయంతో ఉన్న విజయ్ కు ఎన్నికల వ్యూహకర్తగా తనకున్న అనుభవం జోడించి సహకరిస్తానని, ఆయన సైతం బీహార్‌లో తనకు సహకరిస్తారని తెలిపారు. బీహార్‌లో విజయ్‌కు పెద్దసంఖ్యలో అభిమానులు ఉన్నట్టు చెప్పారు. టీవీకేకి తప్పనిసరిగా తమిళనాడులో విజయావకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 118 సీట్లు ఆయన గెలుచుకునే అవకాశాలు బలంగా ఉన్నాయన్నారు.
ఇక విజయ్ తో పొత్తు పెట్టుకోవడానికి ఏఐఏడీఎంకే కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ పీకే సూచనలతో ఆయన ఒంటరి పోరుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే ఎన్నికలకు మరింత సమయం ఉండటంతో ఆ సమయానికి పరిణామాలు మరతాయా.. లేదంటే పొత్తులు ఉంటాయా అనేది చూడాలి.