
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ కు, అధిష్ఠానానికి మధ్య విబేధాలు నడుస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆయన పార్టీని వీడే అవకాశం ఉన్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
ఇటీవల దిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశం సందర్భంగా కేరళలోని పార్టీ నాయకులంతా కలిసి నిల్చొన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..'వారంతా అంటే ఐక్యంగా ఉన్నారు, తమ ముందున్న లక్ష్యాల వెలుగులో వారంతా ఒక్కటిగా కనిపిస్తున్నారు' అంటూ టీమ్ కేరళ అనే హ్యాష్‌ట్యాగ్‌తో రాసుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు వచ్చాయన్న ఊహాగానాలకు రాహుల్ గాంధీ చెక్ పెట్టారు.
ఆ నాయకులలో పార్టీ సీనియర్ నేత శశిథరూర్ సైతం ఉండడంతో ఆయన పార్టీ మార్పు ఊహాగానాలకు రాహుల్ ఫుల్‌స్టాప్ పెట్టినట్లు అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ఆయన వ్యవహరించిన తీరును థరూర్ ప్రశంసించడం, కేరళలో వామపక్ష కూటమి సర్కారు విధానాలను మెచ్చుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, బ్రిటన్ సెక్రటరీ ఆఫ్ ట్రేడ్ జోనాథన్ రేనాల్డ్స్‌తో కలిసి ఉన్న ఫొటోను ఆయన షేర్ చేయడం, కాంగ్రెస్ పార్టీకి తన అవసరం లేదనుకుంటే..తన ముందు చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయని పార్టీకి సందేశం పంపడం వంటి చర్యల నేపథ్యంలో థరూర్ కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరనున్నారనే ఊహాగానాలు వెలువడ్డాయి.
అయితే ఈ వార్తలను థరూర్ కొట్టిపడేశారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేత వారం రోజుల క్రితం పలుమార్లు శశిథరూర్‌ను కలిసి చర్చలు జరిపారు. ఈ క్రమంలో రాహుల్ పోస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. 2026లో జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై పార్టీ అధిష్టానం కేరళ నేతలతో ఈ సమావేశంలో చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఆ తర్వాత రాహుల్ గాంధీతో శశి ధరూర్ క్లోజ్డ్ డోర్ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత దిల్లీలో పార్టీ అధిష్ఠానంతో కేరళ కాంగ్రెస్ నాయకులు భేటీ అయ్యారు.