మహారాష్ట్ర రాజకీయాలు ట్విస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవల డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే తాను అధికార పార్టీని చీల్చి వచ్చిన వారిని అని.. తనతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు సీఎం పదవి దక్కనప్పటి నుంచి ఆయన అసంతృప్తితో ఉన్నారని మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక ఈ వార్తలన్నింటికి మహా సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చెక్ పెట్టారు.
అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో కోల్డ్ వార్ జరుగుతోందంటూ వస్తోన్న వార్తలను డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే చెక్‌పెట్టారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ల సమక్షంలోనే మాట్లాడిన ఆయన.. తమ మధ్య ఎటువంటి విభేదాల్లేవని, కూటమి విచ్ఛిన్నం అయ్యే ప్రసక్తే లేదన్నారు. ముంబయిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముగ్గురు నేతలు.. మీడియాతో మాట్లాడారు.
మీరెన్ని బ్రేకింగ్ న్యూస్‌లు ఇచ్చినా.. మా పొత్తు (మహాయుతి) విచ్ఛిన్నం కాదు. కూటమిలో కోల్డ్‌వార్ వంటి పరిస్థితే లేదు. ఎండలతో మండిపోతున్న మహారాష్ట్రలో కోల్డ్‌వార్ ఎలా సాధ్యం? అని ఏక్‌నాథ్ శిందే పేర్కొన్నారు. తాను, ఫడణవీస్‌లు కేవలం బాధ్యతలు మాత్రమే మార్చుకున్నామని, అజిత్ పవార్ మాత్రం అదే బాధ్యతల్లో కొనసాగుతున్నారని చెప్పారు. మహావికాస్ అఘాడీ నిలిపివేసిన అనేక ప్రాజెక్టులను తాము ప్రారంభించామన్నారు. మహారాష్ట్ర బడ్జెట్‌ను అజిత్ పవార్ ప్రవేశపెడతారని చెప్పారు.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సమావేశాలకు ఇటీవల దూరంగా ఉంటున్న శిందే.. 2022లో ప్రభుత్వాన్ని పడగొట్టిన విషయాన్ని ఇటీవల ప్రస్తావించారు. అప్పట్లో తనను తేలిగ్గా తీసుకున్నారన్నారు. శిందే వర్గం ఎమ్మెల్యేలకు భద్రతను తొలగించడంతోపాటు సచివాలయంలో వైద్య సహాయ కేంద్రాలను ఇద్దరు వేర్వేరుగా ఏర్పాటు చేసుకోవడం చర్చనీయాంశంమైంది. అంతేకాకుండా శిందే హయాంలో ఆమోదించిన ఓ ప్రాజెక్టును ఫడణవీస్ ప్రభుత్వం నిలిపివేయడం కూడా వీరిమధ్య మరింత దూరాన్ని పెంచినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ కూటమిలో వాతావరణమంతా బాగానే ఉందని చెప్పారు.