
నామినేషన్లు మొదలు కావడంతో పొత్తులో భాగంగా ఎమ్మెల్సీ ఇవ్వాలని కూనంనేని సాంబశిరావు కోరుతున్నారు. ఎన్నికల పొత్తులో భాగంగా సీపీఐ రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశామని కూనంనేని పేర్కొన్నారు. ఈ విషయంలో మహేష్‌కుమార్ గౌడ్ తమ సూచనలను సానుకూలంగా విన్నారని కూనంనేని సాంబశిరావు చెప్పారు. ...కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని కూనంనేని సాంబశిరావు తెలిపారు. మహేష్‌కుమార్ గౌడ్‌ను కలిసిన వారిలో చాడ వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అరెపల్లి మోహన్ ఉన్నారు.
ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయాలపై పీసీసీ అధ్యక్షుడు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్దిని బీజేపీ, కేంద్ర మంత్రులు అడుగడునా అడ్డుకుకంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణపై నిత్యం విషం చిమ్ముతున్నారన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కిషన్ రెడ్డి రాష్ట్రాభివృద్దికి మోకాలడ్డుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్రం నుంచి 8మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రాన్ని ఒప్పించి నిధులు ఎందుకు తీసుకు రావడంలేదని పీసీసీ అధ్యక్షుడు నిలదీశారు. కేంద్రం వైఖరితో మెట్రో పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు గురించి కూడా రాజకీయాలు చేయడ సిగ్గు చేటుగా పీసీసీ అధ్యక్షుడుపేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న ఎంపీ రఘునందన్ రావు పాచికలు పార్టీలో పారకపోవడంతో దిక్కుతోచని స్థితిలో రాష్ట్రంలో పాలన పడకేసిందని కాంగ్రెస్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు దుయ్యబట్టారు.