తెలంగాణలో ఇటీవల మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.  రెండు టీచర్స్, ఒక పట్టభద్రుల స్థానానికి గతనెల 27న పోలింగ్‌ జరిగింది.  ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి నిరాశే ఎదురైంది. అంచనాలు లేకుండా బరిలో దిగిన బీజేపీ సత్తా చాటింది. ప్రభంజనం సృష్టించింది.  ఈ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా సీఎం కూడా కాంగ్రెస్‌ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. అయినా రిజల్ట్‌ మారలేదు. ఇదే ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.


కాంగ్రెస్‌ గెలుపు కోసం సీఎం రేవంత్‌రెడ్డి కూడా ప్రచారం చేశారు. నరేందర్‌రెడ్డి తరఫున పోలింగ్‌కు మూడు రోజుల ముందు రెండు మూడు ఉమ్మడి జిల్లాల్లో సభలు నిర్వహించారు. పట్ఠభద్రులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.  దీంతో పట్టభద్రులు కాంగ్రెస్‌వైపు మళ్లుతారన్న చర్చ జరిగింది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. బీజేపీ విజయాన్ని అడ్డుకోలేకపోయారు.


మెదక్‌-కరీంనగర్‌- ఆదిలాబాద్‌-  నిజామాబాద్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఇప్పటి వరకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించారు.  ఆరేళ్ల క్రితం బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఎన్నికల్లో జీవన్‌రెడ్డి అనూహ్యంగా విజయం సాధించారు.  ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండి సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.   కాంగ్రెస్‌ తరఫున బలమైన అభ్యర్థి అల్ఫోర్స్‌ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి బరిలో దిగారు.  దీంతో విజయం నల్లేరుపై నడకే అనుకున్నారు.  అయితే బీజేపీ తరఫున బరిలో నిలిచిన అంజిరెడ్డి తరఫున కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డితోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు సైలెంట్‌గా ప్రచారం చేశారు. దీంతో అనూహ్యంగా బీజేపీ విజయం సాధించింది.


ఇక సిట్టింగ్‌ ఎమ్మెల్సీని తప్పనిసరిగా గెలవాలని అధిష్ఠానం పీసీసీకి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, పార్టీ ముఖ్య నాయకులకు దిశా నిర్దేశం చేసింది. కానీ చివరకు ఓటమి తప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అమలు  చేస్తున్న కార్యక్రమాలను పట్టభద్రుల వద్దకు తీసుకెళ్లి ప్రచారం చేసుకోవడంలో అధికార పార్టీ విఫలమైందన్న ప్రచారం నడుస్తోంది.  ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో ఓటమితో ఇప్పుడు అధికార హస్తం పార్టీ తెలంగాణలో బలహీన పడిందా అన్న చర్చ జరుగుతోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి:

bjp