ఎటువంటి హంగూ ఆర్భాటాలు లేకుండా బీజేపీ అధిష్ఠానం ఆయా జిల్లాల అధ్యక్షులను నియమించింది. ఇప్పుడు ఇక రాష్ట్ర అధ్యక్షుడి పదవే మిగిలింది. ఈ క్రమంలో ఇప్పటికే పలు పేర్లు వినిపించాయి. ఇప్పుడు తాజాగా మరికొన్ని తోడయ్యాయి. మరో పది, ఇరవై రోజుల్లో రాష్ట్రానికి కొత్త కమల దళపతి వస్తున్నారనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.


ఇంతకు ముందు రాష్ట్రంలో అధ్యక్ష పదవికి ఈ రేంజ్ లో పోటీ ఉండేది కాదు. కానీ తెలంగాణలో బీజేపీ బలపడుతుండటంతో పాటు ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని అధిష్ఠానం రాష్ట్రంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో పార్టీలో అధ్యక్ష పదవిపై పోటీ పెరిగింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ ని అనూహ్యంగా పదవి నుంచి తప్పించి ఆ బాధ్యతలను హైకమాండ్ కిషన్ రెడ్డికి అప్పగించింది.


ఇప్పుడు మళ్లీ ఆయన్నే అధ్యక్షుడిగా నియమించాలనే డిమాండ్ పార్టీలో ఓ వర్గం నుంచి వినిపిస్తోంది. ఆయన తాజాగా అధ్యక్ష పోటీలో తానే లేనని స్వయంగా ప్రకటించారు. అయినా అధ్యక్ష రేసులో ఆయన పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక బండి సంజయ్ తో పాటు పార్టీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రఘునందన్ రావు, గొంగిడి మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు తదితర పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.


ఇక మురళీ ధర్ రావు పేరు కూడా తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ భాజపా నాయకత్వం పార్టీ నాయకులకే ఇస్తారా.. లేక వేరే పార్టీ నుంచి వచ్చిన నాయకులకు ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. గెలవడంతో పాటు తమ రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని తమకు అవకాశం ఇవ్వాలని కొందరు పార్టీ సీనియర్లు కోరుతున్నారని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో భాజపా సంస్థాగత వ్యవహారాల ఇన్ ఛార్జి సునీల్ బన్సల్ ఈ నెల 8న హైదరాబాద్ కి రానున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎవరైతే బాగుంటదన్న విషయంపై ఆయన నేతల అభిప్రాయాలనే స్వీకరించి అధిష్ఠానానికి నివేదిక ఇస్తారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: