ఏపీ ఎన్నికల సందర్భంగా కూటమి ఇచ్చిన ముఖ్య మైన హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. తాము అధికారంలో వస్తే మహిళలకు ఉచిత ప్రయాణం అని కూటమి నేతలు ప్రచారం చేశారు. చంద్రబాబు పాలన చేపట్టి ఎనిమిది నెలలు దాటింది. దీంతో  మహిళలు ఉచిత బస్సు హామీపై ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చింది. 


ఏపీలో మహిళలకు జిల్లాల్లో ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది తప్ప రాష్ట్రమంతా కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళలు ఎవరి జిల్లాలో వారు ఉచితంగా ప్రయాణించొచ్చు కానీ.. పక్క జిల్లాకు వెళ్లేటప్పుడు కాదన్నమాట! తెలంగాణలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే ఉచిత బస్సు ప్రయాణం చెల్లుబాటు అవుతుంది. కానీ ఏపీలో దీనికి పరిమితులు విధించారు అని అర్థం అవుతోంది. కేవలం ఆ జిల్లాకే మాత్రమే పరిమితం చేసి.. అక్కడి నుంచి ఛార్జీలు పెట్టుకొని వెళ్లాల్సిందే.


అయితే ఈ వ్యవహారంపై విపక్షాల నుంచి విమర్శలు మొదలయ్యాయి.  ఇంతకాలం ఫ్రీ, ఫ్రీ అని చెప్పి ఇప్పుడు కండిషన్స్ పెడుతున్నారా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.   జిల్లా స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేస్తామని చెప్పడం మోసం అని.. అమలు చేయాలన్న చిత్తశుద్ది లేక చెప్పే సాకులని.. పథకం అమలుకు ముందే ఇన్ని నిబంధనలు పెట్టే ఈ ప్రభుత్వం.. రేపు అమల్లోకి తెచ్చే సరికి నియోజక వర్గం, మండల స్థాయి వరకే ఫ్రీ అంటారేమో అని ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిళ ఎద్దేవా చేశారు.  


దీనిపై టీడీపీ స్పందిస్తూ..  ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు, నారా లోకేష్ లు చెప్పిన మాటలో ఉన్న స్పష్టతను వెల్లడించింది. వీడియోలు షేర్ చేసింది. ఒక జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలకు ఉచిత ప్రయాణం అని టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ఎన్నికలకు ముందు స్పష్టమైన హామీ ఇచ్చారని.. ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటున్నారని.. అని సాక్ష్యాలతో సహా వెల్లడించింది!

మరింత సమాచారం తెలుసుకోండి: