ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తవుతోంది.  తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ రెండు నియోజకవర్గాల్లో కూటమి విజయం సాధించింది.  త్వరలోనే మున్సిపల్ ఎన్నికల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.  మంత్రి నారాయణ మున్సిపల్ ఎన్నికల పైన కీలక ప్రకటన చేశారు.  రాష్ట్రంలోని పుర పరిధిలో ఉన్న కోర్టు లిటిగేషన్లను పరిష్కరించి జూన్‌లో ఎన్నికలకు వెళ్తామని నారాయణ తెలిపారు.  



రాష్ట్రంలోని 21 మున్సిపాలిటీ లకు ఎన్నికలు జరగాల్సి ఉందన్నారు.  కోర్టు కేసులు పరిష్కారమయ్యాక స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు, రాజకీయ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ క్రమంలో  ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.  


ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయిదు స్థానాలు కూటమికే దక్కనున్నాయి. రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలు 2029 వరకు కూటమి ఖాతాలోనే జమ కానున్నాయి. ఇక, మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జరగాల్సి ఉంది. ఇక, ఇప్పుడు ఎన్నికలు జరగాల్సిన 21 మున్సిపాల్టీలో జూన్ నెలలో నిర్వహించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం అయిన వైసీపీ ఈ ఎన్నికల్లో తమ బలం నిరూపించుకునేందుకు సిద్దం అవుతోంది. కూటమి పార్టీలు ఈ ఎన్నికల్లో గెలవటం ద్వారా మరింత పట్టు బిగించాలని భావిస్తోంది.


ఇదిలా ఉండగా గతంలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. అప్పటి అధికార వైసీపీ నేతలే దాదాపు పుర, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలు గెలుచుకున్నారు. అక్కడక్కడ టీడీపీ మద్దతుదారులు పోటీ చేసినా.. పార్టీ మాత్రం ఎన్నికలకు దూరంగా ఉంది. మరి ఈసారి జగన్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలో ఉంచుతారా లేక గతంలో టీడీపీ మాదిరిగా దూరంగా ఉంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా ఈ సమయం జగన్ కు పరీక్ష లాంటిదని మరి వీటన్నింటిని తట్టుకొని జగన్ నిలబడతారా లేదా అనేది వేచి చూడాలని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: