గుజరాత్‌లో దాదాపు రెండు దశాబ్దాలుగా బీజేపీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రయత్నించినా.. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాలేకపోతుంది.  పైగా ప్రతి ఎన్నికల్లో బలం పెంచుకోవాల్సిన పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఇన్నేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చొని కాలక్షేపం చేస్తే రాజకీయ నాయకుల మనుగడ చాలా కష్టం అవుతుంది. 



ఈ క్రమంలో కొందరు అధికార పార్టీతో చేతులు కలిపి తమ పనులు చేయించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రజల అంచనాలను అందుకోలేకపోవడానికి కాంగ్రెస్ నేతలే కారణమని ఆరోపణలు చేశారు. పార్టీలో ఉంటూ బీజేపీకి పనిచేస్తున్న వారిని గుర్తించాలని ఆయన చేసిన సూచన సంచలనం రేపుతోంది.  


అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు.  గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ గత 20-30 ఏళ్లుగా ప్రజల అంచనాలను ఎందుకు అందుకోలేకపోయింది? దీనికి సమాధానం ఒక్కటే అని అన్నారు. గుజరాత్ నాయకత్వం, కార్యకర్తలు, జిల్లా, బ్లాక్ అధ్యక్షులలో రెండు రకాల నాయకులు ఉన్నారు.


ఒక వర్గం నిజాయితీగా పనిచేస్తూ, ప్రజలను గౌరవిస్తూ వారి కోసం పోరాడుతున్నారు. పార్టీ సిద్ధాంతాన్ని తమ గుండెల్లో పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఇక రెండో రకం ప్రజలతో సంబంధాలు కొనసాగించకుండా వారితో దూరంగా ఉంటూ, కనీసం గౌరవం కూడా ఇవ్వరు. వీరిలో సగం మంది బీజేపీతో టచ్‌లో ఉన్నారు" అని సంచలన వ్యాఖ్యలు చేశారు.


గుజరాత్‌లో మూడు దశాబ్దాలుగా బీజేపీ అధికారంలో ఉంది. ఈ పాలనలో రాష్ట్రం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని రాహుల్ విమర్శించారు. అయితే, ప్రజలకు సరైన మార్గం చూపించడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆయన అంగీకరించారు. బీజేపీకి 'బి-టీమ్' కాదని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. "ఈ రెండు వర్గాలను వేరు చేయడం నా బాధ్యత. కాంగ్రెస్‌లో నాయకులకు కొదవలేదన్నారు.  రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు గుజరాత్ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీసే అవకాశం ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp