
విజయవాడ రాజకీయాలలో సంచలనం చోటు చేసుకోనుంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా రాజకీయ సన్యాసం చేయనున్నారు. విజయవాడ రాజకీయాల్లో ఇక రాధా పేరు వినిపించే అవకాశం లేదని ఆయన సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఇక విజయవాడలో రంగా పేరు మాత్రమే వినిపించే అవకాశం కనిపిస్తోంది. వంగవీటి రంగా రాజకీయ వారసుడిగా ప్రవేశం చేసిన రాధా రాజకీయంగా ఎదగలేకపోయారు. 2004లో తొలిసారి కాంగ్రెస్ పార్టీలో చేరి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన రాజకీయంగా వేసిన తప్పటడుగులు ఆయన పొలిటికల్ కెరీర్ను పాతాళంలోకి దిగజార్చాయి. 2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యంలోకి వెళ్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ నుంచి మరోసారి విజయవాడలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల ముందు రాధా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే చంద్రబాబు ఆయనకు సీటు ఇవ్వలేదు. ఆ ఎన్నికలలో రాధా తన కోరుకున్న విజయవాడ సీటు ఇచ్చేందుకు జగన్ ఒప్పుకోలేదు.
అవనిగడ్డ లేదా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయమని చెప్పారు. రాధా అందుకు అంగీకరించలేదు తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓడిపోయింది.. 2024 ఎన్నికలలో తెలుగుదేశం ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం వీడి జనసేనలోకి వెళతారా అన్న ప్రచారం కూడా జరిగింది. కారణం ఏదైనా చంద్రబాబు ఇప్పటివరకు దాదాపు ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఎమ్మెల్సీ సీటు రాకపోవడంతో రాధా రాజకీయాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కుటుంబ సమస్యలు కూడా ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయానికి కారణాలుగా కనిపిస్తున్నాయి అన్న గుసగుసలు కూడా విజయవాడ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.