
ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి కారణం ఎవరు ఏంటి అంటే పలు అంశాలు బలంగా చెప్పవచ్చు. అందులో పవన్ ఫ్యాక్టర్ కూడా ఒకటనే విశ్లేషణలు ఉన్నాయి. అదే సమయంలో కేంద్రంలోని మోదీ అండదండలు కూడా బాగా పనిచేశాయని చెబుతారు. ఇక చంద్రబాబు రాజకీయ చాణక్యం ఇలా ప్రతి అంశం 2024 ఎన్నికల్లో బలంగా పనిచేసింది.
ఇక ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తోంది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరో 15 సంవత్సరాల పాటు ఈ కూటమి ప్రభుత్వం కొనసాగుతుందని.. మూడు పార్టీలు కలిసి సాగుతాయని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. తమ మధ్య విభేదాలు కూడా రావని చెప్పుకొచ్చారు. పదేళ్లపాటు ఈ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని కూడా తేల్చేశారు.
అయితే జన సైనికులు మాత్రం పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు సీఎం అయ్యారన్నది ఎక్కువ వాదన. కింది స్థాయిలో మాత్రం ఇదే ఎక్కువగా వినిపిస్తోంది. తాజాగా జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ పెద్ద బాంబు పేల్చారు. కేవలం పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు సీఎం అయ్యారని చెప్పుకొచ్చారు. పవన్ రెక్కల కష్టంతోనే కూటమి గెలిచిందని తేల్చి చెప్పారు. ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
జనసేనలో పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరంటే మనోహర్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పుడు అదే నాదేండ్ల జనసేన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులో భాగంగా జనసేన లేకుంటే టీడీపీ గెలిచేది కాదని తేల్చి చెప్పారు. ఈ రాష్ట్రానికి సీఎంగా చంద్రబాబు కాలేకపోయేవారని అన్నారు. అయితే జన సైనికులను ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్. కూటమి పార్టీల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మూడు పార్టీల శ్రేణులపై ఉందని హితబోధ చేశారు పవన్. కానీ ఇప్పుడు క్యాబినెట్ సహచరుడు, పార్టీలో కీరోల్ ప్లే చేస్తున్న నాదెండ్ల మనోహర్ జనసేన లేనిదే టిడిపి కూటమి ప్రభుత్వం లేదని చెప్పడం మాత్రం కాస్త వైరల్ అంశంగా మారింది.