ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి తొమ్మిది నెలలు కావొస్తోంది. ఈ నేపథ్యంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు గురించి ప్రతిపక్ష నేతలు విమర్శలు చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్క హామీ అమలుపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు.  ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా మే నుంచి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 


ముఖ్య పథకాలపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం  ఆ పథకాలకు సంబంధించి ఈ వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించింది.  ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా.. ఈ పథకం అమలు ముహూర్తంతో పాటుగా అర్హతల పైన స్పష్టతనిచ్చింది.  కౌలు రైతులకు సైతం పథకం వర్తింప చేస్తామని ఫుల్ క్లారిటీ ఇచ్చింది.  ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు అన్నదాత సుఖీభవ పథకం పై కీలక ప్రకటన చేశారు.


గత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పేరిట సాగుకు ప్రోత్సాహం అందించేవారు. ప్రతి రైతుకు కేంద్ర ప్రభుత్వ సాయంతో కలిపి రూ.13,500 అందించేవారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 ఇచ్చేది. కేంద్ర ప్రభుత్వం మరో ఆరువేల రూపాయలు మూడు విడతల్లో అందించేది. ఇప్పుడు దీనిపై క్లారిటీ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఆ రూ.6000 తో మరో రూ.14000 కలిపి.. మొత్తం 20 వేల రూపాయలను అర్హత కలిగిన ప్రతి రైతుకు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి శాసనసభలో ప్రకటించారు.


మే నెలలోనే ఈ మొత్తాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో దాదాపు 55 లక్షల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి జరుగుతుందని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. అన్నదాత సుఖీభవ పథకం అర్హత ఉన్న అందరికీ అందిస్తామని మంత్రి శాసనసభలో ప్రకటించారు. పథకం విధివిధానాలపై కసరత్తు జరుగుతోందని.. వ్యవసాయ అనుబంధ రంగాల వారికి ప్రాధాన్యం ఇస్తామని ఆయన వెల్లడించారు. పంటల బీమా సౌకర్యంతో పాటుగా భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు మద్దతుగా నిలుస్తామని చెప్పారు. మొత్తానికైతే మేలోనే అన్నదాత సుఖీభవ పథకం అమలు అని తేలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

cbn