
గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు నేతలపై కేసులు నమోదు చేస్తూ, హడలెత్తిస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా రాజకీయ సన్యాసం తీసుకున్న విజయసాయిరెడ్డిపైనా నజర్ ప్రకటించినట్లు కనిపిస్తోంది. కాకినాడ పోర్టు వాటాల బదిలీ విషయంలో విచారణకు హాజరుకావాలంటూ విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ తాజాగా నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.
వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత నెక్ట్స్ ఎవరు? అన్న ప్రశ్నకు సినీ నటుడు పోసాని క్రిష్ణమురళిని తెరపైకి తెచ్చి సస్పెన్స్ కు తెరదించింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు పోసాని తర్వాత ఎవరు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సమయంలో ఎవరి ఊహాలకు అందని విధంగా వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డిని ముందుకు తెచ్చింది. కాకినాడ సీపోర్టు వాటాలను బలవంతంగా లాక్కున్నారనే ఆరోపణలపై ఆయనపై గత ఏడాది డిసెంబరులో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఈడీ విచారణను ఎదుర్కొన్న విజయసాయిరెడ్డికి తాజాగా సీఐడీ నుంచి పిలుపు వచ్చింది.
మంగళగిరి నియోజకవర్గంలో విజయసాయి రెడ్డిపై కేసు నమోదు అయింది. కాకినాడ పోర్టుల వాటాలను బదిలీ చేసిన నేపథ్యంలో ఓ వ్యక్తి.. వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి పై కేసు పెట్టారంట. ఈ కేసును ప్రామాణికంగా తీసుకున్న ఏపీ సీఐడీ పోలీసులు తాజాగా ఆయనకు నోటీసులు జారీచ చేశారు. మార్చి 12న విచారణకు హాజరు కావాలని కూడా ఈ నోటీసుల్లో స్పష్టం చేసింది.
కాగా ఇప్పటి వరకు తనపై 21 కేసులు నమోదైనట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. కాకినాడ పోర్టు విషయంలో విజయ సాయిరెడ్డిపై కేసు నమోదైన తర్వాత ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. జగన్ కేసుల్లో బెయిల్ పై ఉన్న ఆయన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొదటి సారిగా సీబీఐ విచారణ జరుపుతోంది. రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి సీఐడీ ద్వారా కేసును సీబీఐకి అప్పగించారు. మొత్తానికి విజయసాయికి నోటీసులు ఇచ్చిన అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగుగా మారింది. ఇక ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది.