అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారు. విదేశాలకు ఎందుకు సాయం చేయాలని అప్పట్లో వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేస్తున్నారు.  ఇప్పటికే డబ్ల్యూహెచ్ వోకి నిధులను నిలిపివేసిన ట్రంప్.. ఇప్పుడు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు.  ప్రపంచ దేశాలకు సాయం అందించే యూఎస్ ఎయిడ్ సేవలను నిలిపివేశారు.


యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్‌ఎయిడ్) ద్వారా నడుస్తున్న వేలాది కార్యక్రమాలకు ముగింపు పలకనున్నట్లు అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. ఈ ప్రభావం భారత్ పై గణనీయంగా పడనుంది. భారత్ లోని ట్రాన్స్ జెండర్ల కోసం ఏర్పాటు చేసిన మూడు క్లినిక్ లు మూత పడినట్లు తెలుస్తోంది. దీనివల్ల దాదాపు 5 వేల మందికి వైద్య సేవలు అందట్లేదని నివేదికలు పేర్కొంటున్నాయి. దేశంలో మొట్ట మొదటి సారిగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ట్రాన్స్ జెండర్ క్లీనిక్ కూడా మూత పడింది.


అమెరికా ప్రభుత్వం చేపట్టిన ఆరు వారాల సమీక్ష అనంతరం యూఎస్‌ఎయిడ్‌లోని 83% కార్యక్రమాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. దాదాపు 5200 కాంట్రాక్టులను రద్దు చేసినట్లు రూబియో వెల్లడించారు. "ఇప్పటివరకు వేలాది కోట్ల డాలర్లు వెచ్చించినా, ఆశించిన ఫలితాలు రాలేదు. కొన్నిచోట్ల ప్రతికూల ప్రభావాలు కూడా కనిపించాయి. అందుకే అమెరికా జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ సంస్కరణలను చేపట్టాం," అని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు.


దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. అమెరికా ప్రజలు చెల్లిస్తున్న పన్నులు వల్ల ఏయే దేశాలు బాగు పడుతున్నాయో.. ఎవరికి నిధులు వెళ్తున్నాయో ఇప్పటికి అయినా అర్థం అయిందా అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరోవైపు అమెరికన్లు చెల్లించిన పన్నుల డబ్బుతో నిధులు సమకూర్చిన అన్ని ప్రాజెక్టులను నిలిపివేసేందుకు ట్రంప్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. తన అమెరికా ఫస్ట్ విధానానికి అనుగుణంఆ ఉన్నాయని నిర్ధారించుకోవడానికి సమీక్ష కోసం అన్ని దేశాల విదేశీ సహాయాలను 90 రోజుల పాటు నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: