
గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. అనే మాట తరచుగా వింటూనే ఉంటాం. వ్యక్తి అయినా.. వ్యవస్థ అయినా.. సాధార ణం నుంచి అసాధరణం వరకు ఎదిగే క్రమంలో దీనిని పేర్కొంటాం. అయితే.. మాజీ సీఎం జగన్ మోహన్ పార్టీ విషయానికి వస్తే.. వైసీపీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా.. అనే చెప్పాలి. కేంద్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఢిల్లీలోనే ఎదిరించి.. తన ఎంపీ స్థానానికి రాజీనామా సమర్పించి.. ఒంటరి పోరాటానికి శ్రీకారం చుట్టిన జగన్.. ఢిల్ల నుంచే తన రాజకీయాలను ప్రారంభించారు.
నిజానికి ఎంతో మంది సీనియర్లు, డీఎంకే అప్పటి అధినేత కరుణానిధి వంటివారు కూడా.. కేంద్రంలోని సోనియా గాంధీ ప్రభుత్వానికి దొసిలొగ్గాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. కన్న కుమార్తె జైలుకు వెళ్లగా.. ఆమెను విడిపించుకునేందుకు ఆయన వీల్ చైర్‌లో ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతటి హవా చలాయించిన సోనియాగాంధీని.. ఢిల్లీ పెద్దని.. ఎదిరించి.. తనకంటూ.. ప్రత్యేక పార్టీని స్థాపించిన నాయకుడు జగన్. అందుకే ఆయన ప్రస్తానం గురించి.. పార్టీ ప్రస్తానం గురించి చెప్పాల్సి వస్తే.. ఢిల్లీతోనే మొదలు పెట్టాలి.
ఇంతింతై అన్నట్టుగా ఎదిగిన జగన్.. తన తండ్రి.. వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆలంబనగా పుచ్చుకుని ఎదిగా రనే చెప్పాలి. ఆయన ఫొటో.. ఆయన నామ స్మరణ ఉన్నంత వరకు.. జగన్ బాగానే సక్సెస్ అయ్యారు. అయితే.. ఎంతైనా అధికారం చేతిలో ఉందన్న ఒకింత ఈగో.. ఆయనను దారి తప్పేలా చేసింది. తన ఇమేజ్‌తోనే గత ఎన్నికల్లో ప్రచారంచేయడం.. వైఎస్ ఇమేజ్‌ను తగ్గించే ప్రయత్నం చేయడం వంటివి.. వైసీపీని పతనానికి దించేశాయి. ఫలితంగా 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయేలా చేసింది.
ఆ ఒక్క తప్పు..
సహజంగా.. రాజకీయాల్లో చారిత్రక తప్పులు పార్టీలను దెబ్బ తీస్తాయి. గతంలో దేశాన్ని పాలించే అవకా శం వస్తే కమ్యూనిస్టులు వదులుకున్నారు. ఇది ఆ పార్టీలకు చారిత్రక తప్పుగా మారింది. అలానే వైసీపీకి కూడా.. గత ఎన్నికల సమయంలో ఎన్డీయేలో చేరే అవకాశం వచ్చింది. ఇదే జరిగి ఉంటే.. వైసీపీ పరిస్థితి వేరేగా ఉండేదన్న చర్చ ఉంది. కానీ, జగన్ కాలదన్నుకున్న ఈ అవకాశం.. పార్టీకి అన్ని అవకాశాలను రాకుండా.. లేకుండా కూడా చేసింది. ఈ ఒక్క తప్పు చేయకుండా ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదన్న ఆశాభావం కూడా ఉంది.