
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. అప్పటి వరకు బలంగా ఉన్న వైసీపీ ఓటమి తర్వాత బలహీనం అయింది. అదే సమయంలో కూటమి పార్టీలు బలంగా పుంజుకుంటున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తిరిగి పుంజుకునేందుకు విపక్ష వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ పార్టీ నుంచి కీలక నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. దీంతో చాలా నియోజకవర్గాల్లో పార్టీకి క్యాడర్ ఉన్నా దిశానిర్దేశం చేసే నేతలు కరవయ్యారు.
దీనికి తోడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమని ఇబ్బందులకు గురి చేసిన వైసీపీ నేతలను, ఇష్టారీతిన మాట్లాడిన వారిని గుర్తించి మరీ అరెస్టులు చేస్తోంది. దీంతో పార్టీ ముఖ్య నేతలు అంతా సైలెంట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా ఏదైనా నిరసనలకు పిలుపునిస్తుంటే స్పందన అంతంత మాత్రంగా ఉంటోంది.
దీనిని గుర్తించిన జగన్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. చాలా చోట్ల పార్టీ నియామకాలు ఆగిపోయాయి. ఈ మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి జిల్లా అధ్యక్షులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీలు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఏ నియోజకవర్గంలో కూడా జాప్యం జరగకూడదన్నారు. జనరల్ సెక్రటరీలు, రీజనల్ కోఆర్డినేటర్లు, కేంద్ర కార్యాలయం నుంచి ఇంఛార్జ్‌లు అందరూ అందుబాటులో ఉంటారని, కమిటీల విషయంలో జాప్యం జరగడానికి వీల్లేదని అధినేత జగన్ చెప్పినట్లు వారికి తెలిపారు.
కమిటీల పై సీరియస్ గా దృష్టిపెట్టాలని, జిల్లా అధ్యక్షులు వెంటనే వీటిపై స్పందించాలని సజ్జల ఆదేశించారు. కమిటీల నియామకం పూర్తయితే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా మంచి స్పందన వస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి వారికి తెలిపారు. మరి జగన్ తీసుకున్న నిర్ణయాలు పార్టీకి ఎంత మేర లాభిస్తాయో చూడాలి.